రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ నేత రాఘవ్ చడ్డా పేరు పంజాబ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న చడ్డా.. పంజాబ్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో తన పేరును ‘షిఫ్టెడ్’గా పేర్కొన్నారని వెల్లడించారు. తన ఓటర్ ఐడీ మొహాలీలోనే రిజిస్టర్ అయి ఉండగా ఇలా ఎలా గుర్తించారంటూ ప్రశ్నించారు.
తన పేరు తొలగింపు కేవలం క్లరికల్ మిస్టేక్ కాదని, రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందని రాఘవ్ చడ్డా ఆరోపించారు. తాను పంజాబ్ నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడినని, తన ఓటర్ ఐడీ మొహాలీలోనే ఉందని స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ మాత్రమేనని, తుది జాబితా కాదని తెలిపారు. క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ ప్రక్రియలో తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని చెప్పారు.
ఓటర్ జాబితా తయారీలో బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) నుంచి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO), డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ (DEO) వరకు పలువురు అధికారులు పనిచేస్తారని చడ్డా పేర్కొన్నారు. ఇంతటి వ్యవస్థ ఉన్నప్పటికీ తన పేరును ‘షిఫ్టెడ్’గా ఎలా గుర్తించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల విషయంలో ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా, తన విషయంలో వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టినట్లు అనిపిస్తోందని ఆరోపించారు.
అయితే రాఘవ్ చడ్డా ఆరోపణలను AAP ఖండించింది. SIR ప్రక్రియ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందని, ఓటర్ జాబితాలో పేర్లను చేర్చడం లేదా తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం లేదని స్పష్టం చేసింది. దీంతో చడ్డా పేరు తొలగింపు వ్యవహారం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తుది ఓటర్ జాబితాలోనూ ఆయన పేరు ఉండదా? లేక క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ అనంతరం తిరిగి చేరుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








