రాయ‌దుర్గంలో హిట్ అండ్ ర‌న్.. ప‌వ‌న్ స్నేహితుడి కుమారుడి అరెస్ట్‌

రాయ‌దుర్గంలో హిట్ అండ్ ర‌న్.. ప‌వ‌న్ స్నేహితుడి కుమారుడి అరెస్ట్‌

Summarize with AI

హైదరాబాద్‌లో(Hyderabad) మరో హిట్‌ అండ్‌ రన్‌ (Hit-and-Run) ఘటన కలకలం రేపింది. రాయదుర్గం(Raidurgam) పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఏపీ డిప్యూటీ సీఎం స్నేహితుడు, టీటీడీ బోర్డ్ మెంబ‌ర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి (Anand Sai) కుమారుడు(Son) సందీప్‌ను(Sandeep) రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.

ఓఆర్‌ఆర్‌ రోటరీ–ఖాజాగూడ (ORR Rotary–Khajaguda) ప్రధాన రహదారిపై ఇన్నోవా కారు నందులాల్‌ (Nandulal) అనే వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నందులాల్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మరో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన మహీంద్రా కారు నందులాల్‌ను ఢీకొట్టడంతో ఆయన మృతి చెందాడు. ఈ ఘటనలో విద్యార్థి జైద్‌షా కద్రీ (Zaid Shah Qadri) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం మహీంద్రా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు మహీంద్రా కారును గుర్తించారు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కారును నడిపిన సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సందీప్‌ నడిపిన కారు కారణమైందని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు కారును సీజ్‌ చేశారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

సందీప్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు (Pawan Kalyan) సన్నిహితుడైన వ్యక్తి కుమారుడు కావ‌డంతో ఈ ఘటన రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల హైదరాబాద్‌ మాదాపూర్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో జనసేన ఎంపీ లింగమనేని రమేశ్‌ (Lingamaneni Ramesh) కుమారుడు సంజూష్ (Sanjush) ఓ యువ‌తిని బ‌లితీసుకున్న విష‌యం తెలిసిందే. లగ్జరీ కారును నిర్ల‌క్ష్యంగా న‌డుపుతూ భారతి ముఖి (Bharathi Mukhi) అనే సేల్స్‌గ‌ర్ల్‌ను కారుతో ఢీకొట్టి ఆమె మృతికి కార‌ణ‌మ‌య్యాడు. అయితే ఆ కేసులో ఇప్పటివరకు ఆయనను పోలీసులు అరెస్టు చేయలేదు.

తాజాగా రాయదుర్గం ప్రమాదం నేపథ్యంలో సందీప్‌ను పోలీసులు అరెస్టు చేయడం, వాహనాన్ని సీజ్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, డ్రైవింగ్‌ సమయంలో పరిస్థితులు, ఘటన అనంతరం వాహనం ఎందుకు ఆపకుండా వెళ్లిందన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సందీప్‌పై నమోదైన కేసులో తదుపరి చర్యలు ఏమిటి? అతడిని ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు? ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వస్తాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment