ఏపీలో(AP) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) వేళ జనసేనలో(Jana Sena) అనిశ్చితి (Uncertainty) నెలకొంది. స్థానిక ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్న జనసేన నాయకులకు సీట్ల వాటాల (Seat Sharing) వివాదం కొరకరాని కొయ్యగా మారింది. కూటమిలో స్థానిక పోరు సీట్ల పంపకాల పంచాయితీపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీకి(TDP) 80 శాతం, జనసేనకు(Jana Sena) 15 శాతం, బీజేపీకి(BJP) 5 శాతం సీట్లను మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కేటాయిస్తూ నిర్ణయించినట్టుగా టీడీపీ అనుకూల మీడియాలో లీకులు రావడం జనసేన నాయకులు ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది.
జనసేన నాయకులు అసంతృప్తి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరకు పాకింది. దీంతో పవన్ కల్యాణ్.. జనసైనికుల ఆగ్రహాన్ని చల్లార్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే కేబినెట్ మీటింగులకు (Cabinet Meetings) గౌర్హాజరు కావడం, ముఖ్యమైన సమావేశాలకూ డుమ్మా కొట్టడం ఈ కోవకు చెందినవేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూటమిలోని పెద్దల ఈ ఎడబాటు కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగమేనంటున్నారు ఆ నేతల మనసెరిగిన శ్రేష్ఠులు.
స్థానిక ఎన్నికల్లో ఈసారి వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు పట్టుబడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో(2024 Assembly Elections) కూటమి ప్రయోజనాల పేరుతో కేవలం 21 స్థానాలకే పరిమితమైనట్లు, స్థానిక పోరులో అలాంటి త్యాగానికి ససేమీరా అనే సిగ్నల్స్‌ను బహిరంగంగానే బయటపెడుతున్నారు. జనసేన శాసనసభాపక్ష సమావేశంలో(Janasena Legislature Party Meeting) కూడా “2024 పరిస్థితి పునరావృతం కాదు” అనే సంకేతాలను పవన్ కల్యాణ్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి.
కూటమి అధికారంలోకి రావడానికి జనసేన కార్యకర్తలు శ్రమించారని, పవన్ ఆదేశాలతో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం వారి పార్టీ క్యాడర్ కంటే ఎక్కువగా పనిచేశామని జనసైనికులు గుర్తుచేస్తున్నారు. కానీ, ఇప్పుడు స్థానిక సంస్థల్లో అధికారాన్ని పంచుకునే సమయం రాగానే తమను 15 శాతం స్థానాలకు పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సీట్లు టీడీపీవి.. ఓట్లు జనసేనవి.. జెండాలు మోసేది జనసైనికులు.. పదవులు అనుభవించేది మాత్రం టీడీపీ నాయకులా?” అన్న ప్రశ్న జనసేన అంతర్గత చర్చల్లో బలంగా వినిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
స్థానిక సంస్థల సీట్ల పంపకాలపై మూడు పార్టీల పెద్దలు కూర్చుని అధికారికంగా చర్చించాల్సి ఉండగా, ఇంత వరకు ఒక్క సమావేశం కూడా జరగలేదు. అంతకు ముందే నారా లోకేష్ (Nara Lokesh)సీట్ల వాటాలను నిర్ణయించారని లీకులు రావడం యాదృచ్ఛికం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా ఒక తక్కువ వాటాను ప్రచారంలోకి తెచ్చి, జనసేన నుంచి వచ్చే ప్రతిస్పందనను అంచనా వేయడం.. ఆ తర్వాత స్వల్పంగా పెంచి గొప్పగా ఇచ్చినట్లు చూపించడం టీడీపీ బేరసారాల వ్యూహం కావచ్చని విశ్లేషిస్తున్నారు.
లోకేశ్ లీకులతో సీట్ల ఫార్ములాపై కిందిస్థాయిలో మొదలైన అసంతృప్తి చివరకు పవన్ కల్యాణ్(Pawan Kalyan) వరకూ చేరిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జనసేన నాయకుల నుంచి ఒత్తిడి పెరగడంతో తన అసంతృప్తిని బయటకు చూపాల్సిన పరిస్థితి పవన్‌కు ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో కేబినెట్ సమావేశాలకు, కొన్ని ముఖ్య ప్రభుత్వ కార్యక్రమాలకు పవన్ దూరంగా ఉండటాన్ని ఈ పరిణామాలతో ముడిపెట్టి రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు.
ప్రధాని పాల్గొన్న భోగాపురం కార్యక్రమం (Bhogapuram Event) మినహా ఇటీవల చంద్రబాబుతో (Chandrababu)కలిసి పవన్ కళ్యాణ్ వేదికలు పంచుకుంది లేదు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలకు సైతం పవన్ హాజరుకావడం లేదు. ఇదే సమయంలో క్యాంపు కార్యాలయంలో తన శాఖల అధికారులతో సమీక్షలు చేపట్టడం, ఏనుగులకు స్వాగతం పలకడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాల్ని జనసేన అధికారికంగా తెలిపింది.
అయితే పవన్ గైర్హాజరును టీడీపీపై నిజమైన తిరుగుబాటుగా భావించలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్థానిక ఎన్నికల కోటాపై లోకేష్ లీకుల తరువాత ఇప్పటి వరకు ఉమ్మడిగా కూటమి పార్టీల నాయకులు సమావేశం కాకపోవడం “నాన్ సీరియస్‌నెస్”కు (Non-Seriousness) నిదర్శనమని అంటున్నారు. కేబినెట్ సమావేశాలకు వెళ్లకుండా ఉండటం తప్ప టీడీపీ నాయకత్వాన్ని నిలదీసే రాజకీయ కార్యాచరణ కనిపించడం లేదు.
ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ద్వారా “టీడీపీకి తలొగ్గడం లేదు” అనే అభిప్రాయాన్ని జనసైనికుల్లో కలిగించడం, అసంతృప్తి తగ్గిన తర్వాత మళ్లీ యథావిధిగా కూటమి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే పవన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైకి ఎడబాటు చూపిస్తూ, లోలోపల చంద్రబాబు నిర్ణయాలకు అంగీకరించడం వల్ల జనసేనకు రాజకీయంగా దక్కేదేమిటని వాదనలు వినిపిస్తున్నాయి.
నిజంగా తమ బలాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్న జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందని, కూటమి పార్టీలతో గట్టిగా వాదించి తన వాటాను సాధించకుండా మౌనంగా, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం దేనికి సంకేతం అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎడబాటు టీడీపీని నిలదీసే వ్యూహం కాదు.. జనసైనికుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు, వారిని మెత్తబరిచే వ్యూహమే అంటున్నారు.








