వీడియో కాల్‌లో వైద్యం.. మ‌హిళ మృతి

వీడియో కాల్‌లో డాక్టర్ల సలహాతో అబార్షన్.. మ‌హిళ మృతి

Summarize with AI

ఏపీలో(Andhra Pradesh) దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. వైద్యుల (Doctors) లెక్క‌లేనిత‌నంతో ఓ మ‌హిళ ప్రాణం గాల్లో క‌లిసిపోయింది. మార్కాపురం (Markapuram) జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకున్న విషాద ఘటన వైద్య వ్యవస్థలో(Medical System) పర్యవేక్షణ లోపాలను ప్రశ్నార్థకం చేస్తోంది. అర్హత కలిగిన వైద్యులు అందుబాటులో లేకపోయినా.. కాంపౌండర్‌(Compounder), నర్సులతో వైద్యం చేయించిన ఘటనలో ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది.

మురారిపల్లెకు చెందిన షేక్‌ మాబున్నీ(Shaik Mabunni) ఐదు నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆస్పత్రిలో(Hospital) వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కాంపౌండర్‌, నర్సులే అబార్షన్‌ ప్రక్రియకు సిద్ధమయ్యారు. వైద్యులను వీడియో కాల్‌లో సంప్రదిస్తూ వారి సూచనల మేరకు అబార్ష‌న్ ప్రక్రియ నిర్వహించారు.

అబార్షన్‌ జరుగుతున్న సమయంలో మాబున్నీకి తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని వీడియో కాల్‌లో ఉన్న వైద్యులు సూచించారు. ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయినట్లు తెలుస్తోంది. చివరకు మాబున్నీ మృతి చెందారు.

వైద్యులు అందుబాటులో లేకుండానే కాంపౌండర్‌, నర్సులతో కీలకమైన వైద్య ప్రక్రియ నిర్వహించారన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వైద్య రంగంలో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని చెబుతున్నప్పటికీ.. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన వైద్యశాఖ పర్యవేక్షణ, ప్రైవేటు ఆస్పత్రులపై తనిఖీలు, నిబంధనల అమలుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

మాబున్నీ మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అర్హత లేని సిబ్బందితో వైద్యం చేయించారన్న ఆరోపణలు నిజమైతే.. సంబంధిత ఆస్పత్రి యాజమాన్యంతో పాటు బాధ్యులపై చట్టపరమైన క‌ఠిన చర్యలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment