డీఎస్సీలో(DSC) అవకతవకలు జరిగాయని, నారా లోకేష్ (Nara Lokesh)రాజీనామా (Resignation) చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీపీఎస్సీపై(APPSC) అసెంబ్లీలో(Assembly) సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) చేసిన ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్ (Former CM YS Jagan) కౌంటర్ ఇచ్చారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, నారా లోకేష్‌లకు బహిరంగ సవాల్ విసిరారు. డీఎస్సీ-2025, ఏపీపీఎస్సీ-2018 వ్యవహారాలపై సీబీఐ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాము తప్పు చేయలేదని, అందుకే తలెత్తుకుని సీబీఐ విచారణకు (CBI Investigation) సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు (Chandrababu), లోకేష్(Lokesh) కూడా సిద్ధమైతే వెంటనే సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ విషయంలో వైసీపీ(YSRCP) ఇప్పటివరకు ప్రజల ముందుంచిన పలు అంశాలు వాస్తవమేనని చంద్రబాబు ప్రభుత్వం క్రమంగా అంగీకరించే పరిస్థితి వచ్చిందని జగన్ అన్నారు. డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై చర్చించాలని తమ ఎమ్మెల్సీలు నాలుగు రోజుల పాటు శాసనమండలిలో ఆందోళన చేసినా.. ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదని విమర్శించారు.
డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ(Question Papers), పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారికి(Single Officer) అప్పగించినట్లు మంత్రి నారా లోకేష్ స్వయంగా అంగీకరించారన్నారు. ప్రశ్నపత్రాలు తయారు చేసే వ్యవస్థ, పరీక్ష నిర్వహించే వ్యవస్థ మధ్య ఉండాల్సిన ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’(Checks and Balances) తొలగించడం వల్లే లీకేజీకి అవకాశం ఏర్పడిందని, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు అవసరమని డిమాండ్ చేశారు.
డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ విభాగంలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ప్రభుత్వం అంగీకరించిందని, అయితే మొదటి మెరిట్ లిస్ట్‌లో పేరు ఉన్న నవీన్‌ను తర్వాతి జాబితా నుంచి ఎందుకు తొలగించారో చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు (Certificate Verification) అభ్యర్థి రాలేదని అధికారులు చెబుతున్నారని, అయితే అభ్యర్థి ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపకపోతే అతను వెరిఫికేషన్‌కు ఎలా హాజరవుతాడని జగన్ ప్రశ్నించారు. ఈ అంశంపై నవీన్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారు.
డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు ఇచ్చామని ప్రభుత్వం అంగీకరించిందని జగన్ చెప్పారు. పీవీ సింధు వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రత్యేక విధానాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వడాన్ని సాధారణ స్పోర్ట్స్ కోటా టీచర్ నియామకాలతో పోల్చడం సరికాదన్నారు. సింధుకు ఒలింపిక్స్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో అనేక విజయాలు ఉన్నాయని, అలాంటి క్రీడాకారిణితో సాధారణ నియామకాలను పోల్చడం సమంజసం కాదని అన్నారు.
స్పోర్ట్స్ కోటాలో నియామకాల కోసం ప్రభుత్వం పలు జీవోలు తీసుకురావడం, ఆ తర్వాత వాటిని రద్దు చేయడంపై కూడా జగన్ ప్రశ్నలు సంధించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో టీచర్ పోస్టుల బేరసారాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు బయటకు వచ్చినప్పటికీ వాటిపై సమగ్ర దర్యాప్తు జరగలేదన్నారు.
ఒంగోలులో(Ongole) ఓ డీఎస్సీ అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో(Sports Quota) ఉద్యోగం ఇప్పిస్తామని రూ.14 లక్షలు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. మరో వ్యక్తికి ఉద్యోగం వచ్చిందని, కానీ డబ్బులు చెల్లించిన అభ్యర్థికి ఉద్యోగం రాలేదని పేర్కొన్నారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ డీఎస్సీ ఉద్యోగం కోసం జరిగిన బేరసారాలను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయకుండా వేరే ఉద్యోగానికి సంబంధించిన అంశంగా నమోదు చేశారని ఆరోపించారు.
ఇక ఏపీపీఎస్సీ-2018 గ్రూప్-1 నియామకాలపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను కూడా జగన్ ఖండించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే 2019 మేలో ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయ్యాయని, అనంతరం కోవిడ్ (COVID-19) పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో మార్పులు చేయాల్సి వచ్చిందని వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కనపెట్టి మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించి, ఆ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి 163 మందికి నియామకాలు చేపట్టామని తెలిపారు.
జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరగలేదని ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలిందని, OMR మూల్యాంకన స్లిప్పుల్లోనూ మార్పులు, చేర్పులు లేవని సిట్ నివేదికలోనే పేర్కొన్నట్లు జగన్ చెప్పారు. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులపై ఎలాంటి ప్రభావం పడలేదని కూడా సిట్ పేర్కొన్నట్లు తెలిపారు.
చంద్రబాబుకు జగన్ మరోసారి సవాల్ విసిరారు. డీఎస్సీ-2025తో పాటు 2018 గ్రూప్-1 నోటిఫికేషన్‌పైనా సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తాము తప్పు చేయలేదని, చంద్రబాబు కూడా సిద్ధంగా ఉంటే వెంటనే సీబీఐ దర్యాప్తు కోసం లేఖ రాయాలని డిమాండ్ చేశారు.








