తెలంగాణలో (Telangana) సినిమా టికెట్ ధరల పెంపుపై (Cinema Ticket Price Hike) రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలు పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని (20 Percent) సంక్షేమ విరాళంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC)కి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ సంబంధిత నిర్మాతలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంపై (Additional Revenue) వర్తించే 20 శాతం మొత్తాన్ని ప్రదర్శకుల (ఎగ్జిబిటర్ల)(Exhibitors) నుంచి నిర్మాతలే (Producers) వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనంతరం ఆ మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సంక్షేమ సంఘం (Telugu Film Industry Employees Federation Welfare Association) ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.
ఈ సంక్షేమ నిధిని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) ద్వారా నిర్వహించే ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. దీంతో టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు రాబడిలో కొంత భాగం సినీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమానికి వినియోగించే విధానం స్పష్టతకు వచ్చింది.
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు నాలుగు సినిమాలకు వర్తించనున్నాయి. ‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు’, ‘పెద్ది’ చిత్రాలకు టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంపై ఈ 20 శాతం సంక్షేమ విరాళం నిబంధన వర్తిస్తుంది.
సంబంధిత చిత్రాల నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం సంక్షేమ విరాళాన్ని వసూలు చేసి, నిర్దేశించిన ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం అధికారికంగా చర్యలు చేపట్టింది.
ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ LLP, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా LLP, వృద్ధి సినిమాస్ LLP సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపింది. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన అదనపు రాబడిలో 20 శాతం సంక్షేమ నిధికి మళ్లించే ప్రక్రియను అమలు చేయాలని సంబంధిత నిర్మాతలకు సూచించింది.
సినీ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇస్తున్న సమయంలో అదనపు ఆదాయంలో కొంత మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించే విధానంపై తాజాగా స్పష్టత వచ్చింది.








