‘పోలీస్ కారులో గంజాయి’ కేసు.. కొత్త అనుమానాలు!

'పోలీస్ కారులో గంజాయి' కేసు.. కొత్త అనుమానాలు!

Summarize with AI

ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారులో గంజాయి లభించిందన్న ఘటన తాజాగా మరో మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఇచ్చిన వివరణకు, 24 గంటల తర్వాత జిల్లా ఎస్పీ ఇచ్చిన వివరణకు మధ్య తేడాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ఎస్సైలపై ఉన్నతాధికారులు పూర్తిగా వెనకేసుకొచ్చినప్పటికీ.. డీఎస్పీ, ఎస్పీ చెరో రకంగా వివరాలు వెల్లడించడం అనుమానాలకు తావిస్తోంది.

అద్దంకి సమీపంలో పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన అనంతరం ఆదివారం రాత్రి ఆలస్యంగా డీఎస్పీ బాలమురళీకృష్ణ ఘటనపై స్పందించారు. గంజాయి తరలిస్తున్న ఓ నిందితుడిని పోలీసులు చేజ్ చేస్తూ.. అతడి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నిందితుడు పరారయ్యాడని, అదే సమయంలో పోలీసులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని వివరించారు.

అయితే ఈ వివరణపై స్థానికంగా పలు ప్రశ్నలు తలెత్తాయి. ప్రమాదానికి గురైన కారులో గంజాయి ఎలా ఉంది? ఇద్దరు ఎస్సైలు సివిల్ డ్రెస్‌లో ఎందుకు ఉన్నారు? ఘటనాస్థలంలో గంజాయిపై స్థానికులు ప్రశ్నించినప్పుడు స్పష్టమైన సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయారు? అనే అంశాలపై చర్చ జరిగింది.

ఈ వ్యవహారంపై దాదాపు 24 గంటల తర్వాత సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. అద్దంకి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రమాదానికి గురైన కారును పరిశీలించిన ఆయన.. పోలీసులు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.

కారులో లభించిన గంజాయి మరో కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్నదేనని, ఆ కేసుకు సంబంధించిన గంజాయి కారులోనే ఉండిపోయిందని ఎస్పీ వివరణ ఇచ్చారు. దీంతో తొలుత డీఎస్పీ చెప్పిన ‘గంజాయి నిందితుడిని చేజ్ చేస్తూ ప్రమాదం’ అనే వివ‌ర‌ణ‌కు, ఎస్పీ ఇచ్చిన వివరణకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు కారును పరిశీలించి డిక్కీలో గంజాయి ఉందంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే గంజాయి విషయంలో స్థానికులు అడిగిన ప్రశ్నలకు పోలీసులు వెంటనే స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారం సంబంధించిన వీడియోలు, కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీస్ శాఖపై ఒత్తిడి పెరిగింది. దాదాపు ఐదు గంటల పాటు ఘటనపై స్పష్టమైన అధికారిక వివరణ లేకపోవడం కూడా పలు అనుమానాలకు కారణమైందంటున్నారు న్యాయ నిపుణులు.

ఇదే ఇప్పుడు ఈ కేసులో ప్రధాన చర్చగా మారింది. ఒకవైపు గంజాయి నిందితుడిని చేజ్ చేస్తూ ప్రమాదం జరిగిందని డీఎస్పీ వివరణ ఇవ్వగా.. మరోవైపు అదే గంజాయి గతంలో మరో కేసులో సీజ్ చేసినదని, కారులో ఉండిపోయిందని ఎస్పీ చెప్పడం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

గంజాయి ఏ కేసులో సీజ్ చేశారు? ఎప్పుడు సీజ్ చేశారు? ఆ గంజాయిని ఎందుకు ప్రైవేట్ కారులో ఉంచారు? సీజ్ చేసిన వస్తువులకు సంబంధించిన రికార్డులు ఏమిటి? ప్రమాదానికి ముందు ఆ గంజాయి ఎక్కడికి తరలిస్తున్నారు? అనే ప్రశ్నలకు పోలీసులు పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వాల్సి ఉందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇద్దరు ఎస్సైల వ్యవహారాన్ని సమర్థించడం కూడా రాజకీయంగా, ప్రజల్లో చర్చకు దారితీసింది. వారు సివిల్ డ్రెస్‌లో ప్రైవేట్ కారులో ఉండటం క్రైమ్ దర్యాప్తులో సాధారణమేనని అధికారులు చెబుతున్నారు. అయితే పోలీసుల వాహనంలో గంజాయి లభించిన వ్యవహారంపై పూర్తి వివరాలు, సీజ్ మెమో, కేసు వివరాలు, వాహన వినియోగానికి సంబంధించిన అంశాలను బహిర్గతం చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

మరోవైపు ఈ వ్యవహారంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉన్నతాధికారుల ద్వారా వివరణ ఇప్పించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇద్దరు ఎస్సైలపై చర్యలు తీసుకోకుండా.. ఘటనను కేవలం రోడ్డు ప్రమాదం కోణంలోనే పరిమితం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తాజా పరిణామాల్లో పోలీసులపై యాక్సిడెంట్ కేసు నమోదు చేసి గంజాయి వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రమాదం, గంజాయి స్వాధీనం, ఇద్దరు ఎస్సైల డ్యూటీ, సీజ్ చేసిన గంజాయి కారులో ఉండటానికి కారణం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిగితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఒకే ఘటనపై డీఎస్పీ, ఎస్పీ ఇచ్చిన వివరణల్లో తేడాలు ఎందుకు వచ్చాయి? కారులో ఉన్న గంజాయి ఏ కేసుకు సంబంధించినది? దాని పూర్తి రికార్డులు ఏమిటి? ఇద్దరు ఎస్సైల పాత్రపై శాఖాపరమైన విచారణ జరుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అద్దంకి గంజాయి కేసులో కీలకంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment