టీమిండియా(Team India) మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు (Ravichandran Ashwin) ఊహించని అనుభవం ఎదురైంది. క్రికెట్‌కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించిన తర్వాత ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా(YouTube Content Creator) బిజీగా ఉన్న అశ్విన్.. తన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో రికార్డ్ చేస్తుండగా ఇంటి సెక్యూరిటీ గార్డు (Security Guard) వరుసగా ఫోన్ చేయడంతో అప్రమత్తమయ్యాడు. అదే సమయంలో భార్య కూడా ఫోన్ చేయడంతో ఏదో ముఖ్యమైన విషయం జరిగిందని భావించాడు. ఇంటి తలుపు వద్ద పోలీసులు(Police) ఉన్నారని ఆమె చెప్పడంతో అశ్విన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అయితే అక్కడికి వెళ్లి చూడగా.. తన పాస్‌పోర్ట్‌ను (Passport) తిరిగి ఇచ్చేందుకు ఓ పోలీస్ అధికారి వచ్చినట్లు తెలిసి ఊపిరి పీల్చుకున్నాడు. వీసా కోసం పాస్‌పోర్ట్‌ను సమర్పించానని, దానిని తిరిగి ఇచ్చేందుకు పోలీస్ అధికారి ఇంటికి వచ్చారని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో వెల్లడించాడు.
తనలాంటి ప్రముఖ క్రికెటర్‌కు కూడా ఇలాంటి సాధారణ ఘటనలు ఎదురవుతాయని చెప్పిన అశ్విన్.. తాను స్టార్ క్రికెటర్‌గా కాకుండా సాధారణ వ్యక్తిలా జీవించడానికే ఇష్టపడతానని తెలిపాడు. 2024 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు (International Cricket) వీడ్కోలు పలికిన అశ్విన్.. ఆ తర్వాత ఐపీఎల్‌కు(IPL) కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 287 మ్యాచ్‌లు ఆడి 765 వికెట్లు సాధించాడు. భారత క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే తర్వాతి స్థానంలో ఉన్న అశ్విన్.. 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లోనూ కీలక భాగస్వామిగా ఉన్నాడు. ప్రస్తుతం తన క్రికెట్ అనుభవాలను విశ్లేషణలు, యూట్యూబ్ కార్యక్రమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు.







