దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల(Schools) సంఖ్య ఒక్క ఏడాదిలో (One Year) దాదాపు 9,900 మేర తగ్గడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Union Ministry of Education) విడుదల చేసిన UDISE 2025-26 గణాంకాల ప్రకారం.. 2024-25లో దేశంలో 8.89 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక(Government Primary), ఉన్నత ప్రాథమిక పాఠశాలల (Upper Primary Schools) సంఖ్య 2025-26 నాటికి సుమారు 8.80 లక్షలకు తగ్గింది. రాష్ట్రాల వారీగా చూస్తే మేఘాలయలో అత్యధిక తగ్గుదల నమోదుకాగా, ఆ తర్వాత తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాల్లోనూ గణనీయమైన తగ్గుదల కనిపించింది.
అత్యధిక తగ్గుదల మేఘాలయలో(Meghalaya) నమోదైంది. అక్కడ 7,633 నుండి 5,459కి పడిపోయింది. అంటే 2,174 పాఠశాలలను మూసివేశారు. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో పాఠశాలల సంఖ్య 1,961 తగ్గగా, ఆంధ్రప్రదేశ్లో ఈ సంఖ్య 1,446 మేర తగ్గింది. బీహార్లో(Bihar) ఈ సంఖ్య 66,803 నుండి 66,915కి పెరగగా, ఛత్తీస్గఢ్లో(Chhattisgarh) 43,836 నుండి 43,853కి పెరిగింది.
అయితే దాదాపు 9,900 పాఠశాలల సంఖ్య తగ్గడానికి విద్యార్థుల (Students) కొరతే ఏకైక కారణమని చెప్పడానికి ప్రస్తుతం స్పష్టమైన అధికారిక ఆధారాలు లేవు. పాఠశాలల విలీనం(School Merger), పునర్వ్యవస్థీకరణ(Reorganisation), స్థానిక పరిస్థితులు(Local Conditions), విద్యార్థుల సంఖ్యలో మార్పులు తదితర అంశాలు పాఠశాలల సంఖ్య తగ్గడానికి కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెరగడం కూడా కనిపించడంతో.. ఈ మార్పుల వెనుక రాష్ట్రాలవారీగా భిన్నమైన విధానాలు, పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా గ్రామీణ(Rural), పేద (Poor) మరియు వెనుకబడిన వర్గాల (Backward Sections) పిల్లలకు విద్యను అందించే కీలక వ్యవస్థ కావడంతో ఈ తగ్గుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల విలీనం లేదా పునర్వ్యవస్థీకరణ ద్వారా మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, వనరులను సమర్థంగా వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ.. విద్యార్థుల ప్రయాణ దూరం, పాఠశాలల అందుబాటు, ఉపాధ్యాయుల లభ్యత, మౌలిక వసతులు, విద్యా నాణ్యత వంటి అంశాలపై ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల తగ్గిన 9,900 పాఠశాలల్లో ఎన్ని విలీనం అయ్యాయి, ఎన్ని మూసివేశారు, ఏ కారణాలతో ఈ మార్పులు జరిగాయన్న దానిపై మరింత స్పష్టమైన అధికారిక వివరాలు కీలకంగా మారాయి.








