తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయ్‌నిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని ఆయన నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు నడుమ అరెస్ట్ చేశారు. తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీ ఫిర్యాదు మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం ఉదయ్‌నిధి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది.
ఈ వివాదానికి సోమవారం తంజావూరులో జరిగిన డీఎంకే కార్యక్రమం కారణమైంది. కావేరీ జలాల అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేయగా, దానికి స్పందిస్తూ ఉదయ్‌నిధి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్‌లో ఉన్నాయని టీవీకే ఆరోపించింది. మహిళను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ పార్టీ నాయకులు తంజావూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉదయ్‌నిధి నివాసం వద్దకు భారీగా చేరుకున్న డీఎంకే కార్యకర్తలు పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉదయ్‌నిధి, తాను ఎవరిపేరునూ ప్రస్తావించలేదని, తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. మరోవైపు టీవీకే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తూ, ఉదయ్‌నిధి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
ఈ వ్యవహారంపై టీవీకే జాతీయ మహిళా కమిషన్ (NCW)ను కూడా ఆశ్రయించింది. ఉదయ్‌నిధి ప్రసంగానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, ఆయన నుంచి వివరణ కోరడంతో పాటు బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కమిషన్‌ను కోరింది. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే, టీవీకే మధ్య రాజకీయ పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.









అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా ఎమోజీలు!