కోలీవుడ్ స్టార్ సూర్య ఇటీవల విడుదలైన ”కరుప్పు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫైనల్ రన్‌లో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూర్య కెరీర్‌లో మరో బిగ్ హిట్‌గా నిలిచింది. ఈ విజయోత్సాహంలో ఉన్న సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతుండగా, మరోవైపు తన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు. ‘జై భీమ్’తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌తో మరోసారి చేతులు కలిపి తన కెరీర్‌లో 48వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్‌లో సూర్య, కథానాయిక కయాదు లోహర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య ఓ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి భారీ విజయాలను అందించిన హొంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ‘జై భీమ్’తో సంచలనం సృష్టించిన సూర్య–జ్ఞానవేల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.








