అస్సాంలో(Assam) భారీ వర్షాలు(Heavy Rains), వరదలు (Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) తాజా వివరాల ప్రకారం, శివసాగర్ (Sivasagar) జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్ (Golaghat) జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో వరదల కారణంగా మృతుల సంఖ్య 78కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 3 లక్షలకు పైగా ప్రజలు వరద ముంపులోనే జీవనం సాగిస్తున్నారు. 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 551 గ్రామాలు నీటమునిగిపోగా, సుమారు 21,523 హెక్టార్ల వ్యవసాయ భూములు (Agricultural Lands) దెబ్బతిని రైతులకు (Farmers)భారీ నష్టం వాటిల్లింది. చరాయిదేవు జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమై, అక్కడ ఒక్క జిల్లాలోనే 1.37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం 71 పునరావాస శిబిరాల్లో 16,500 మందికి పైగా ఆశ్రయం పొందుతుండగా, మరో 72 వేల మందికి 30 సహాయ కేంద్రాల ద్వారా ఆహారం, నిత్యావసర వస్తువులు (Essential Supplies) అందిస్తున్నారు. వరదల ప్రభావంతో రహదారులు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతినగా, 11 వేలకుపైగా పశువులు, ఇతర జీవాలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గువాహటి నగరంతో పాటు కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో పట్టణ వరదల పరిస్థితి ఇంకా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, అస్సాంలోని పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో (Himanta Biswa Sarma) ఫోన్లో సమీక్షించి, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరద నీరు తగ్గుతున్నప్పటికీ ఇళ్లలో పేరుకుపోయిన బురద, ధ్వంసమైన రహదారులు, విద్యుత్, తాగునీటి సమస్యలతో ప్రజల ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. బాధిత రైతులు, వ్యాపారులను ఆదుకునేందుకు బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రుణ సదుపాయాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ (Dheeraj Seth) వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం చేపడుతున్న సహాయక చర్యలను సమీక్షించి, బలగాల సేవలను అభినందించారు.








