పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్'(Adipurush) సినిమా విడుదల సమయంలో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, రామాయణాన్ని తెరపై ఆవిష్కరించిన తీరుపై ప్రేక్షకులు, పలు హిందూ సంఘాలు (Hindu Organizations) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన రచయిత మనోజ్ ముంతషీర్ (Manoj Muntashir) తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో సినిమాపై వచ్చిన విమర్శలను సమర్థించిన ఆయన.. ఇప్పుడు బహిరంగంగా తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మనోజ్ ముంతషీర్ (Manoj Muntashir), “‘ఆదిపురుష్'(Adipurush) సినిమా నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. సినిమా విడుదల తర్వాత దానిని సమర్థించడం అంతకంటే పెద్ద పొరపాటు” అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ సినిమా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దేశ ప్రజలందరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. ప్రజల విశ్వాసాలు, మనోభావాలను గౌరవించడం అత్యంత ముఖ్యమని, ఆ విషయంలో జరిగిన పొరపాటుకు పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మరోసారి ‘ఆదిపురుష్’ (Adipurush) వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి.








