హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) లాహౌల్-స్పితి జిల్లాలో (Lahaul-Spiti District) ఘోర ప్రమాదం జరిగింది. పంగీ-కిలాద్ రహదారిపై (Pangi-Killar Road) ప్రయాణిస్తున్న ఓ వాహనంపై ఒక్కసారిగా కొండచరియలు (Landslides) విరిగిపడటంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వాహనం నుజ్జునుజ్జయి, వెనుక భాగంలో మంటలు చెలరేగాయి
కుల్లు నుంచి పంగీ ప్రాంతానికి వెళ్తున్న టాటా సుమో వాహనం (Tata Sumo Vehicle) పంగీ-కిలాద్ మార్గంలో వెళ్తుండగా కొండపై నుంచి ఉన్నట్టుండి భారీ బండరాళ్లు, మట్టి దిబ్బలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో దాదాపు 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విరిగిపడిన పెద్ద రాళ్ల ధాటికి టాటా సుమో పూర్తిగా నజ్జునుజ్జయ్యి లోయ ఘాట్‌లోనే చిక్కుకుపోయింది. వాహనం వెనుక భాగంలో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద తీవ్రంగా గాయపడిన ఒక ప్రయాణికుడిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసి, అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను వెలికితీసేందుకు జేసీబీలతో రాళ్లను తొలగిస్తున్నారు.
సదరు పంగీ-కిలాద్ రోడ్డులో (Pangi-Killar Road) గురువారం కూడా భారీగా కొండచరియలు విరిగిపడటంతో అధికారులు ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రహదారి పునరుద్ధరణ పనులు పూర్తి చేసి, శుక్రవారం ఉదయమే వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే, రోడ్డు తెరిచిన కొన్ని గంటల్లోనే మళ్లీ కొండచరియలు పడి ఈ దారుణ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.








