ముదురుతున్న వివాదం.. ‘RAW NTR’ ఆగ్రహం

ముదురుతున్న వివాదం.. RAW NTR ఆగ్రహం

Summarize with AI

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, సేవా కార్యక్రమాల చుట్టూ జరుగుతున్న వివాదం ముదురుతోంది. ‘RAW NTR’ సంస్థకు, జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ఎన్టీఆర్ కార్యాలయం పేరిట ఒక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ లేఖపై ‘RAW NTR’ వ్యవస్థాపకుడు, ప్రతినిధి సాయిరూప్ తీవ్రంగా స్పందించారు. తాము ప్రకటించిన విధంగా కార్యక్రమాన్ని చేపడతామని, ఇబ్బందులు ఎదురైతే లీగల్ గా ఫైట్ చేస్తామని తెగేసి చెప్పారు.

టీడీపీ అనుకూల మీడియా ఛానల్ అయిన ABN లైవ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, ఎన్టీఆర్ ఆఫీస్ విడుదల చేసినట్లు చెబుతున్న ఆ లేఖ విశ్వసనీయతపై సంచలన సందేహాలు వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ సంతకం లేకుండా ఆ ప్రకటన అసలు ఎలా రిలీజ్ అయ్యిందని సాయిరూప్ లాజిక్ ప్ర‌శ్న వేశారు. ఆ లేఖకు ఎలాంటి అథెంటిసిటీ లేదని, అసలు ఆ లేఖ విడుదలైన విషయమే ఎన్టీఆర్‌కు తెలిసి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. “ఒకవేళ ఎన్టీఆరే స్వయంగా నన్ను పిలిచి, ఈ కార్యక్రమాలన్నీ ఆపేయమని చెబితే.. నేను వెంటనే అన్నింటినీ ఆపేస్తాను” అని సాయిరూప్ స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీలోని కొంతమంది పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని సాయిరూప్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనను ‘వైసీపీ వ్యక్తి’, ‘పేటీఎం బ్యాచ్’ అంటూ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“RAW NTR అనేది కేవలం సేవాతత్వంతో ఏర్పాటైన ఆర్గనైజేషన్. దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. మేము గత ఆరు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం. మాది పూర్తి అఫీషియల్ సంస్థ. దీనికి ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఉంది, గుర్తింపు ఉంది, వేలాది మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానుల్లో అన్ని పార్టీల వారు, అందరూ ఉంటారు” అని సాయిరూప్ చెప్పారు.

తమపై విమర్శలు గుప్పిస్తున్న ఇతర అభిమాన సంఘాల నాయకులపై సాయిరూప్ తీవ్ర విమర్శలు చేశారు. నన్ను విమర్శించే సదరు నాయకులు సమాజానికి ఎలాంటి సేవ చేయలేదని.. పైగా తనను ఫోన్లలో బెదిరించారని, తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసే అవకాశం ఇస్తే.. తాము పడుతున్న కష్టాన్ని, చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయనకు వివరిస్తామని సాయిరూప్ కోరారు.

ఈ వివాదం ఇలా ఉంటే, మరోవైపు సరికొత్త చర్చ మొదలైంది. “ఎన్టీఆర్‌కి సదరు టీడీపీ అనుకూల మీడియా అంటే ఎందుకంత భయం? ఇలా ప్రతిదానికీ భయపడుతూ కూర్చుంటే.. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునే లక్షలాది మంది ఫ్యాన్స్ కోరిక ఎలా నెరవేరుతుంది?” అంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది సరికొత్త చర్చకు దారి తీశారు. మొత్తానికి ఎన్టీఆర్ ఆఫీస్ లేఖ వెలువడిన తర్వాత కూడా ‘RAW NTR’ వివాదం సద్దుమణగకపోగా.. మరింతగా రాజుకుంటోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment