తెలంగాణకు మరో రెండు విమానాశ్రయాలు..

తెలంగాణకు మరో రెండు విమానాశ్రయాలు..

Summarize with AI

తెలంగాణలో విమానయాన రంగానికి భారీ ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వరంగల్ (మామునూరు) విమానాశ్రయ నిర్మాణాన్ని 2028 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి చేసి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన.. భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పూర్తి చేయడాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం 700 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అందుబాటులో ఉందని, బౌండరీ వాల్ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, రన్‌వేతో పాటు ప్రధాన టెర్మినల్ నిర్మాణానికి కూడా త్వరలో టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. కాకతీయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా వరంగల్ టెర్మినల్‌ను తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

అదే సమావేశంలో ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధిపై కూడా కీలక చర్చ జరిగింది. ప్రస్తుతం డిఫెన్స్ ఆధీనంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి మరో 1,500 ఎకరాల భూసేకరణ అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే సివిల్‌తో పాటు డిఫెన్స్ విమానాశ్రయంగా కూడా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా విమానయాన మౌలిక వసతుల విస్తరణపై దృష్టి పెట్టిన కేంద్రం.. వచ్చే పదేళ్లలో ‘ఉడాన్’ పథకం కింద రూ.30,000 కోట్లతో మరో 100 కొత్త విమానాశ్రయాలు నిర్మించడమే లక్ష్యమని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. దీంతో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజల ఎన్నో ఏళ్ల కల త్వరలోనే సాకారం కానుందనే ఆశలు మరింత బలపడ్డాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment