10 మైళ్ల దూరంలో ఉన్నా.. కాపాడే మాన‌వ‌త్వం లేదా?

10 మైళ్ల దూరంలో ఉన్నా.. కాపాడే మాన‌వ‌త్వం లేదా?

Summarize with AI

“తీరానికి కేవలం పది మైళ్ల దూరంలో బోటు ప్రమాదం జరిగితే.. రాత్రికి రాత్రే స్పందించి ప్రాణాలు కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా?” అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జబ్బర్‌తోటలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతై మ‌ర‌ణించిన‌ మత్స్యకారుల కుటుంబాలను మంగళవారం ఆయన పరామర్శించారు. ప్రాణాలతో బయటపడిన చిన్నాను ప‌రామ‌ర్శించారు.

ఈనెల 1న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారని, కేవలం 10 మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగిందని వైఎస్ జగన్ గుర్తుచేశారు. “జులై 4న చిన్నా ఫోన్‌ చేసి ఇంటికొస్తున్నామని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ, దురదృష్టవశాత్తు ఫోన్‌ చేసిన కాసేపటికే బోటు ప్రమాదానికి గురైంది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలోనే కలెక్టర్‌కు, మెరైన్‌ సీఐకి ప్రమాదంపై మెసేజ్‌లు పంపినా అధికార యంత్రాంగం, ఫిషరీస్ అధికారులు సకాలంలో స్పందించలేదు” అని మండిపడ్డారు.

ప్రభుత్వం గంటల్లో స్పందించి, కోస్ట్‌గార్డ్‌ను వెంటనే రంగంలోకి దించి ఉంటే కనీసం ఐదుగురు మత్స్యకారులైనా ఈరోజు బతికేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత జులై 5న ఒక చైనా మర్చంట్ బోటు సిబ్బంది చిన్నాను కాపాడారని.. ప్రభుత్వం వైపు తప్పు జరిగింది కాబట్టే ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ‘త్రీమెన్ కమిటీ’ వేశారని దుయ్యబట్టారు. ఆ త్రీమెన్ కమిటీ నివేదిక అంతా తప్పుల తడక అని జగన్ కొట్టిపారేశారు.

మత్స్యకారుల ప్రాణాలంటే చంద్రబాబు ప్రభుత్వానికి లెక్కలేదని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులవుతున్నా ఒక్క ఉత్తరాంధ్ర మంత్రి గానీ బాధితులను పరామర్శించడానికి రాకపోవడం దారుణమన్నారు.

“బాధితుల వద్దకు కనీసం మంత్రులను పంపాలనే ఆలోచన కూడా సీఎం చంద్రబాబుకు లేదా? సర్వస్వం కోల్పోయిన ఆ కుటుంబాలకు రూ.5 లక్షలు ముష్టి వేస్తున్నావా బాబూ? ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియాతో పాటు కొత్త ఇల్లు మంజూరు చేయాలి” అని డిమాండ్ చేశారు.

తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే బాధితులందరినీ పూర్తిస్థాయిలో ఆదుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నామని, పాకిస్తాన్ జైళ్లలో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను కూడా సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చిన చరిత్ర తమదన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment