కాంగ్రెస్‌కు 117 సీట్లు కాదు.. కనీసం 7 సీట్లు కూడా రావు

కాంగ్రెస్‌కు 117 సీట్లు కాదు.. కనీసం 7 సీట్లు కూడా రావు

Summarize with AI

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government), సీఎం రేవంత్ రెడ్డిపై అత్యంత ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 77 శాతం రిజర్వాయర్లు (Reservoirs) ఖాళీగా దర్శనమిస్తున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కేసీఆర్(KCR) మీద కోపంతో కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు అని ఆయన ధ్వజమెత్తారు.

గోదావరి నదిలో (Godavari River) ప్రతిరోజూ 9 టీఎంసీల (TMC) నీరు వృథాగా సముద్రం పాలు అవుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం (Retired Engineers Association) కూడా స్పష్టంగా చెప్పింది.. మేడిగడ్డ బ్యారేజీని (Medigadda Barrage) ముట్టుకోకుండానే, కన్నేపల్లి పంప్ హౌస్ (Kannepalli Pump House) ల వద్ద మోటర్లు ఆన్ చేసి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి తన బేషజాల కోసం పంపులు ఆన్ చేయడం లేదు. నీళ్లు లిఫ్ట్ చేయమంటే రేవంత్ రెడ్డి రెంకెలు వేస్తూ, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు” అని కేటీఆర్ మండిపడ్డారు. పక్క రాష్ట్రం ఏపీలో(AP) పట్టిసీమ నుంచి నీళ్లు ఎత్తిపోసుకుంటుంటే, ఇక్కడ రోజుకు 9 టీఎంసీలు వృథా అవుతున్నా పట్టించుకోని వారిని బుర్ర తక్కువ వాళ్లు అనాలా, సన్నాసులు అనాలా అని ప్రశ్నించారు.

మేడిగడ్డ గేట్లు దించితే భద్రాచలం రామాలయం (Bhadrachalam Sri Rama Temple) కొట్టుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 247 టీఎంసీల భారీ వరదలను సైతం తట్టుకుని నిలబడిన మేడిగడ్డ.. కేవలం లక్ష క్యూసెక్కుల వరదకు కొట్టుకుపోతుందా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ వల్ల రాముడికి ముప్పంటే ఆ రాముడికి కూడా కోపం వస్తుందని, భద్రాచలానికి అసలైన ముప్పు ఉంటే అది పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) వల్లేనని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పంపులు ఆన్ చేస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) ఇన్ని రోజులు వాళ్లు చేసిన అసత్యాలన్నీ బయటపడతాయనే భయంతోనే మోటర్లు తిప్పడం లేదని ఆరోపించారు.

“సీఎం రేవంత్ రెడ్డికి మాపై కోపం ఉంటే కేసులు పెట్టుకోవచ్చు.. కానీ రైతుల పొట్ట కొట్టవద్దు. సర్వే నెంబర్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు తప్ప రేవంత్ రెడ్డికి ప్రాజెక్టుల గురించి ఏమాత్రం అవగాహన లేదు. రేవంత్ హైట్ ఒకటే తక్కువ కాదు.. ఆయనకు బుర్ర కూడా తక్కువే” అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. పొద్దున పూట కాంగ్రెస్ జెండా మోస్తూ, రాత్రి వేళల్లో బీజేపీ నేతల కాళ్లు పట్టుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఖండిస్తూ.. తాను ఎప్పటికీ కేసీఆర్ సైనికుడినేనని హరీష్ రావు పదే పదే స్పష్టం చేస్తున్నారని గుర్తు చేశారు.

సర్వేల్లో బీఆర్ఎస్ ఘనవిజయం ఖాయం.. కాంగ్రెస్‌కు సింగిల్ డిజిటే!
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొంద పెట్టడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి స్వయంగా చేయించుకున్న సొంత సర్వే రిపోర్టులోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ 78కి పైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని తేలిందని వెల్లడించారు. ఇది కాకుండా మరో నాలుగు స్వతంత్ర సర్వేలు కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశాయన్నారు. “రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి 117 సీట్లు కాదు కదా.. కనీసం 7 సీట్లు కూడా రావు” అని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని, ప్రస్తుతం కాంగ్రెస్ అకౌంట్ లో ఉన్న రూ. 3వేల కోట్లను ముందుగా ఆ అమరుల కుటుంబాలకు పంచి, తమ పాప ప్రక్షాళన చేసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment