హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. విశ్వసనీయ సమాచారంతో జలాల్ బాబా నగర్లో నిర్వహించిన మెరుపు దాడుల్లో 8 గ్రాముల MDMA డ్రగ్స్, భారీ మొత్తంలో మెఫెంటెర్మిన్ సల్ఫేట్ (Mephentermine Sulphate) ఇంజెక్షన్లు, అలాగే పలు ప్రాణాంతక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ హసన్‌తో పాటు ముజాహిద్‌ను అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో అబ్దుల్ హసన్ బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు, గుజరాత్ నుంచి ఇంజెక్షన్లు తెప్పించి ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా నగరంలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
శరీర దారుఢ్యం పెంచుకోవాలనే ఉద్దేశంతో కొందరు యువకులు ఈ ఇంజెక్షన్లను వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటువంటి ఇంజెక్షన్ల విక్రయం చట్టవిరుద్ధమని, ప్రజలు అక్రమ డ్రగ్స్ వ్యాపారానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ హసన్‌పై ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో దారి దోపిడీ, హత్య, రౌడీషీటర్ కేసులతో పాటు ఇటీవల పాతబస్తీలో నమోదైన హత్య కేసు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక మరెవరు ఉన్నారు? సరఫరా వ్యవస్థ ఎలా నడుస్తోంది? అనే కోణాల్లో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.








