తమిళనాడులో ‘ఓటుకు నోటు’ త‌ర‌హా కుట్ర.. ముగ్గురు అరెస్ట్

తమిళనాడులో 'ఓటుకు నోటు' త‌ర‌హా కుట్ర.. ముగ్గురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) గతంలో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’(Cash-for-Vote) తరహా ఉదంతం ఇప్పుడు తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలను షేక్ చేస్తోంది. కోలీవుడ్ స్టార్, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్(CM Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని కూల్చేందుకు విపక్షాలు భారీ కుట్రకు తెరలేపినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఒక్కో టీవీకే ఎమ్మెల్యేకు(TVK MLA) రూ.35 కోట్ల భారీ ఆఫర్ ఎరవేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిప్పుకునేందుకు ఏపీ త‌ర‌హా ఓటుకు నోటు రాజకీయాన్ని తమిళనాడు ఇంటెలిజెన్స్(Tamil Nadu Intelligence), చెన్నై పోలీసులు (Chennai Police) విజయవంతంగా భగ్నం చేశారు. ఈ హైప్రొఫైల్ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణగిరి జిల్లా ఉతంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా (N. Ilayaraja) ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో ఈ దారుణమైన హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) వ్యవహారం బయటపడింది.

ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ (IPDS) అనే ఒపీనియన్ పోల్ సంస్థ అధినేతగా పరిచయం చేసుకున్న తిరునావుక్కరసు అనే వ్యక్తి ఎమ్మెల్యే ఇళయరాజాను సంప్రదించాడు. అసెంబ్లీ స్పీకర్‌కు వ్యతిరేకంగా త్వరలో ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానంలో సొంత పార్టీ (TVK) కి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు ప్రతిఫలంగా ఏకంగా రూ. 35 కోట్ల భారీ మొత్తాన్ని లంచంగా ఆఫర్ చేశాడు.

ఈ ఆఫర్‌ను ఎమ్మెల్యే తిరస్కరించడమే కాకుండా, ఇకపై ఫోన్ చేయవద్దని హెచ్చరించారు. అయితే, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుటుంబంతో సహా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సదరు వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ట్రిప్లికేన్ (D1) పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఫోన్ కాల్ డేటా, లొకేషన్ల ఆధారంగా నిరంతర నిఘా పెట్టి ముగ్గురు కీలక సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు.

మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం?
ఈ కుట్ర వెనుక విపక్ష డీఎంకే (DMK) కు చెందిన కీలక నేతల హస్తం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అరెస్ట్ అయిన నిందితుడు నరేష్.. డీఎంకే నేత, కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీకి (V. Senthil Balaji) అత్యంత ఆప్తుడని సమాచారం. సెంథిల్ బాలాజీ సోదరుడు వి. అశోక్ కుమార్ (V. Ashok Kumar) ఈ నిందితులతో చెన్నైలో రహస్యంగా సమావేశమైనట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ల కనుసన్నల్లోనే టీవీకే ఎమ్మెల్యేలకు ఈ రూ.35 కోట్ల ఎర వేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం అశోక్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని, డ్రావిడ పార్టీల 59 ఏళ్ల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మే 10న కొలువుదీరిన సంగతి తెలిసిందే. మే 13న అసెంబ్లీలో 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం విజయ్ సక్సెస్‌ఫుల్‌గా ఫ్లోర్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు.

ఈ నేపథ్యంలో టీవీకే మంత్రి పి. నిర్మల్ కుమార్ డీఎంకేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “గత 40 రోజులుగా డీఎంకే నేత స్టాలిన్ (M. K. Stalin), ఆయన బృందం మా ఎమ్మెల్యేలను కొనడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును స్టాలిన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఏఐఏడీఎంకేతో చేతులు కలిపి మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇలాంటి నీచమైన ఓటుకు నోటు రాజకీయాలకు తెరలేపారు. ఆధారాలతో సహా దొరికిపోయారు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారు” అని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనతో తమిళనాడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Join WhatsApp

Join Now

Leave a Comment