తెలంగాణ రాష్ట్ర (Telangana State) కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా (Chief Secretary – CS) 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు (Sanjay Jaju) నియమితులు కానున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు (Ramakrishna Rao) ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమించేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (A. Revanth Reddy) మొగ్గు చూపారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.
ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు, ‘ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ’(Ministry of Development of North Eastern Region – MDoNER) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో (Andhra Pradesh) పాటు తెలంగాణలోనూ పలు కీలక శాఖల్లో ఆయన పనిచేశారు. రాష్ట్రంలో కొత్త సీఎస్ నియామకంపై కేంద్ర ప్రభుత్వం.. సంజయ్ జాజు పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర సర్కార్‌కు లేఖ పంపింది.
ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈ నెలాఖరుతో రిటైర్ అవుతుండటంతో కొత్త సీఎస్ రేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు బలంగా వినిపించాయి. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా కీలక బాధ్యతల్లో ఉన్న జయేశ్ రంజన్ (1992 బ్యాచ్) పేరుతో పాటు, కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు పేర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూలంకషంగా పరిశీలించారు. ఇద్దరు అధికారుల ట్రాక్ రికార్డ్, సీనియారిటీని బేరీజు వేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అంతిమంగా సంజయ్ జాజు వైపే మొగ్గు చూపినట్లు సచివాలయ వర్గాల సమాచారం. జూలై 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించనున్నారు.








