జేసీకి పెద్దారెడ్డి వార్నింగ్‌.. పోలీసుల‌పై సంచ‌ల‌న ఆరోపణలు

జేసీకి పెద్దారెడ్డి వార్నింగ్‌.. పోలీసుల‌పై సంచ‌ల‌న ఆరోపణలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం రణ‌రంగంగా మారింది. తాడిప‌త్రి ప‌ట్టంలో మంగ‌ళ‌వారం సాయంత్రం టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అనుచ‌రులు బీభ‌త్సం సృష్టించారు. వైసీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటనలపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా స్పందించారు. తాడిపత్రిలో శాంతిభద్రతలను పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారంటూ మండిపడ్డారు.

వైసిపి నేత గంగులకుంట కేశవరెడ్డి తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో టీ తాగుతుండగా, జేసీ వర్గీయులు ఆయనపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశవరెడ్డిపై జేసీ వర్గీయులు మరోమారు దాడికి యత్నించారు. ఈ క్ర‌మంలోనే ఆసుపత్రిపై పెద్ద ఎత్తున రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

జేసీ ఇస్తున్న లంచాలకు అలవాటు పడ్డారు – పెద్దారెడ్డి
ఈ ఉదంతాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడిపత్రిలో ప్రస్తుతం చట్టం, న్యాయం అమలు కావడం లేదని ఆరోపించారు. “తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్‌లోనే అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయి. పట్టణంలో గంజాయి విక్రయాలు, చైన్ స్నాచింగ్స్ విచ్చలవిడిగా జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే లంచాలకు ఇక్కడి పోలీస్ అధికారులు అలవాటు పడ్డారు. వారికి వచ్చే జీతాల కన్నా లంచాల రూపంలో పది రెట్లు ఎక్కువ డబ్బు వస్తుండడం వల్లే ఈ ఆగడాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు” అని పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఖాకీ చొక్కా తీసి.. టీడీపీ కండువాలు వేసుకోండి
పోలీసుల తీరును తప్పుబడుతూ పెద్దారెడ్డి మరికొన్ని ఘాటు విమర్శలు చేశారు. “తాడిపత్రి పీఎస్‌లో ఏ చిన్న కేసు నమోదు చేయాలన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? ముందే నేరాలకు పాల్పడటం.. ఆపై తామే కౌంటర్ కేసులు పెట్టడం జేసీ వర్గానికి అలవాటుగా మారింది. తాడిపత్రి పోలీస్ అధికారులు ఖాకీ చొక్కాలు తీసేసి, నేరుగా టీడీపీ కండువాలు వేసుకుంటే బెటర్” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

జూన్ 26న సామూహిక దీక్షకు పిలుపు
జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను, అక్రమాలను తాము చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తాడిపత్రిలో అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈనెల 26వ తేదీన (శుక్రవారం) చేపట్టబోయే సామూహిక దీక్షను పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment