పెద్దపల్లి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై, రాష్ట్ర మంత్రివర్గంపై బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబును లక్ష్యంగా చేసుకుని కీలక కామెంట్స్ చేశారు. ప్రజల సమస్యలపై నిలదీసే నేత పుట్ట మధు రౌడీ అయితే… ప్రజల కోసం పనిచేయని శ్రీధర్ బాబు సమర్థుడా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో “ప్రజా పాలన” పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇది ప్రజా పాలన కాదని, ప్రజా వంచన పాలనగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు సాగితే, ఇప్పుడు రాష్ట్రం రివర్స్ గేర్‌లో అంధకారంలోకి వెళ్తోందని వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్ బాబును “షాడో సీఎం”గా అభివర్ణిస్తూ ఆయనపై మరిన్ని ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు, వడ్ల కోత వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. “క్వింటాల్‌కు 8 కిలోల వడ్లు కోతపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది?” అని ప్రశ్నించారు.
రైతుల సమస్యలపై కూడా జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.6 వేల కమిషన్ రైతుల నుంచి వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. విత్తనాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు వ్యవస్థల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. చదువుకున్న నాయకులే రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ విషయాలను సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు తెలియజేయలేదని మంత్రి శ్రీధర్ బాబును ప్రశ్నించారు.








