యూరప్‌ను (Europe) తీవ్ర వేడి గాలులు (Heatwave) వణికిస్తున్నాయి. గత ఐదు రోజుల్లో ఎండల తీవ్రత కారణంగా కనీసం 40 మంది (40 People) మృతి (Deaths) చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ (France), స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్ దేశాలు అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్రాన్స్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్(red Alert) ప్రకటించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎండల ప్రభావంతో అడవి మంటలు, విద్యుత్ సరఫరా అంతరాయాలు (Power Outages), నీటి కొరత సమస్యలు (Water Shortage) కూడా తలెత్తుతున్నాయి. పలు నగరాల్లో పాఠశాలలు మూసివేయగా, బహిరంగ కార్యక్రమాలను రద్దు చేశారు. అత్యవసర సేవలను ప్రభుత్వం అప్రమత్తం చేసి, ప్రజలకు చల్లని ప్రదేశాల్లో ఉండాలని సూచిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావంతో యూరప్‌లో ప్రతి ఏడాది వేడి తరంగాల తీవ్రత పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ హీట్‌వేవ్ మరికొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తుండటంతో యూరప్ దేశాలు అత్యవసర చర్యలు చేపడుతున్నాయి.








