‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ: సమంత కమ్‌బ్యాక్ అదిరిందా?

'మా ఇంటి బంగారం' మూవీ రివ్యూ: సమంత కమ్‌బ్యాక్ అదిరిందా?

నటీనటులు: సమంత, దిగంత్ (దిగ్నాథ్ మంచాలే), గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, చైతన్య కృష్ణ, మంజుష తదితరులు.
దర్శకత్వం: నందిని రెడ్డి
నిర్మాతలు: సమంత, రాజ్ నిడుమూరు (ట్రాలాల పిక్చర్స్)
సంగీతం: సంతోష్ నారాయణన్

‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ తర్వాత స్టార్ హీరోయిన్ సమంత, వైవిధ్యభరిత చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. అనారోగ్యం, వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో కొంతకాలం సినిమాలకు దూరమైన సమంత.. ఈ చిత్రంతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. భ‌ర్త రాజ్ నిడుమూరు కథను అందించగా, సమంత స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ
స్వర్ణ (సమంత) ఒక సాధారణ హౌస్‌వైఫ్. పెద్దలకు ఇష్టం లేకుండా డాక్టర్ అనిరుధ్ అలియాస్ హనీ (దిగంత్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తన గతాన్ని పూర్తిగా దాచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. చాలా కాలం తర్వాత హనీ చెల్లెలి పెళ్లి కోసం ఆ దంపతులు సొంత ఊరైన బల్లవరం వెళ్తారు. అక్కడ కొత్త కోడలైన స్వర్ణను కుటుంబ సభ్యులు అంత సులభంగా కలుపుకోరు. ఉత్తమ కోడలిగా మార్కులు కొట్టేయడానికి, ముఖ్యంగా తోటికోడలు శ్రీముఖి కంటే బెస్ట్ అనిపించుకోవడానికి స్వర్ణ తన స్నేహితురాలి (మంజుష) సాయంతో వంటలు చేయడం, ముగ్గులు వేయడం వంటివి చేస్తూ ఇబ్బందులు పడుతుంది.

ఇలా సాగుతున్న క్రమంలో, జైలులో ఉన్న కరుణ (గుల్షన్ దేవయ్య) మనుషులు స్వర్ణను గుర్తిస్తారు. ఆమె అచ్చం ఝాన్సీలాగే ఉండటంతో కరుణ రంగంలోకి దిగి స్వర్ణ ఫ్యామిలీని బెదిరించడం మొదలుపెడతాడు. అసలు ఝాన్సీ ఎవరు? ఆమె నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? స్వర్ణగా ఎలా మారింది? కరుణ నుండి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వర్ణ చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగిలిన కథ.

ఫస్టాఫ్
సినిమా ప్రారంభం చాలా వినోదాత్మకంగా ఉంటుంది. సమంత తన భర్త ఊరికి వెళ్లడం, అక్కడ ఫ్యామిలీ కట్టుబాట్లు తెలియక అమాయకంగా చేసే పనులు, ఉత్తమ కోడలిగా నిరూపించుకోవడానికి పడే తాపత్రయం థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఒకవైపు ఫ్యామిలీ డ్రామా, కామెడీ నడుస్తూనే.. మరోవైపు ఆమె గతాన్ని టచ్ చేస్తూ వచ్చే యాక్షన్ సీన్స్ ఇంటర్వెల్ వరకు సినిమాను రసవత్తరంగా నడిపించాయి. ఫస్టాఫ్ సినిమాకు పెద్ద అసెట్.

సెకండాఫ్
సెకండాఫ్‌లో విలన్ కరుణ (గుల్షన్ దేవయ్య) ఎంట్రీతో కథపై హైప్ పెరుగుతుంది కానీ, ఆ తర్వాత వచ్చే సీన్లు నిరాశపరుస్తాయి. విలన్ క్యారెక్టరైజేషన్‌లో స్పష్టత లోపించింది. స్వర్ణను పెళ్లి చేసుకోవాలని విలన్ వెంటాడటం అంత కన్విన్సింగ్‌గా లేదు. స్క్రీన్‌ప్లే ఇక్కడ కాస్త గాడి తప్పిన‌ట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఫైట్, ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో పండలేదు. కథ చాలా ప్రెడిక్టబుల్‌గా సాగడం, రన్‌టైమ్ కాస్త ఎక్కువగా అనిపించడం మైనస్ పాయింట్లు.

నటీనటుల ప‌ర్ఫామెన్స్‌
ఇది పూర్తిగా సమంత ‘వన్ ఉమెన్ షో’. స్వర్ణ పాత్రలో సమంత జీవించేసింది. ఓవైపు అమాయకపు హౌస్‌వైఫ్‌గా నవ్విస్తూనే, మరోవైపు యాక్షన్ సీన్స్‌లో వీరవ‌నిత‌గా దుమ్ములేపింది. నటిగా ఆమెకు ఇది ఖచ్చితంగా ఒక గ్రేట్ కమ్‌బ్యాక్ మూవీ.

విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు (కానీ డబ్బింగ్ మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సింది). భర్త పాత్రలో దిగంత్ సెటిల్డ్‌గా నటించగా.. శ్రీముఖి, గౌతమి, సమంత ఫ్రెండ్‌గా నటించిన మంజుష తమ కామెడీ టైమింగ్‌తో మంచి వినోదాన్ని పంచారు. పోలీస్ పాత్రలో చైతన్య కృష్ణ ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగం
దర్శకురాలు నందిని రెడ్డి ఒక మంచి ఇంట్రెస్టింగ్ లైన్ ఎంచుకున్నారు. ఫస్టాఫ్‌ను అద్భుతంగా డీల్ చేసినా, సెకండాఫ్‌లో ఎమోషన్స్, డ్రామాను బ్యాలెన్స్ చేయడంలో కొద్దిగా తడబడ్డారు. సినిమాకు ప్రధాన బలం సంతోష్ నారాయణన్ సంగీతం. పెళ్లి పాటతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. సమంత డైలాగ్స్ బాగున్నప్పటికీ, తిరుపతి యాస పలకడంలో ఆమె కొద్దిగా తడబడినట్లు అనిపిస్తుంది.

  • ప్లస్ పాయింట్స్
  • సమంత అద్భుతమైన నటన, యాక్షన్ సీన్స్
  • ఫస్టాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ కామెడీ సీన్స్
  • సంతోష్ నారాయణన్ సంగీతం, బీజీఎం
  • ఇంటర్వెల్ బ్యాంగ్
  • మైనస్ పాయింట్స్
  • ప్రెడిక్టబుల్ సెకండాఫ్, సాగదీత సీన్లు
  • క్లారిటీ లేని విలన్ ట్రాక్
  • పండని ఎమోషన్స్

ఫైనల్‌గా చెప్పాలంటే.. ‘మా ఇంటి బంగారం’ నటిగా సమంతకు పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది. ఫస్టాఫ్ లోని కామెడీ, సమంత యాక్షన్ సీన్స్ కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.

రేటింగ్ : 2.25

Join WhatsApp

Join Now

Leave a Comment