అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం.. 14 పాయింట్ల‌తో డీల్‌?

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం.. 14 పాయింట్ల‌తో డీల్‌?

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక తాత్కాలిక ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నాలుగు నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఘర్షణలకు ముగింపు పలికేలా ఇరు దేశాలు కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఫ్రాన్స్‌లోని ‘ఇవియాన్-లె-బైన్స్’ లో జరిగిన జీ7 (G7) సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందంపై సంతకం చేయగా, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కూడా దీనిని ఆమోదించారు.

రెండు దేశాల మధ్య సుమారు నాలుగు నెలల క్రితం ప్రారంభమైన యుద్ధ వాతావరణానికి బ్రేక్ వేస్తూ.. మొత్తం 14 ప్రధానాంశాలతో ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ‘పర్ఫార్మెన్స్ బేస్డ్’ (ఇరాన్ ప్రవర్తన ఆధారిత) డీల్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

యుద్ధానికి ముగింపు
ఈ ఒప్పందంలోని మొదటి ప్ర‌ధాన అంశం ప్రకారం.. అమెరికా, ఇరాన్ మరియు వాటి మిత్రదేశాలు అన్ని ఫ్రంట్‌లలోనూ తక్షణమే, శాశ్వతంగా సైనిక చర్యలను నిలిపివేయాలి. ఇందులో ముఖ్యంగా ‘లెబనాన్’ కూడా ఉంది. లెబనాన్ సార్వభౌమత్వాన్ని ఇరుపక్షాలు గౌరవించాలి. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వ‌ద్దు
అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం ఒకరి సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను మరొకరు గౌరవించుకోవాలి. ఇరు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు.

60 రోజుల డెడ్‌లైన్
ఈ తాత్కాలిక అవగాహన ఒప్పందం ప్రకారం.. పూర్తిస్థాయి తుది ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి రెండు దేశాలకు గరిష్టంగా 60 రోజుల సమయం ఉంటుంది. ఇరు దేశాల పరస్పర అంగీకారంతో ఈ గడువును పొడిగించుకోవచ్చు. ఒకవేళ 60 రోజుల్లో తుది డీల్ కుదరకపోతే “మళ్లీ బాంబుల దాడి మొదలవుతుంది” అని ట్రంప్ హెచ్చరించారు.

నావికా దళ దిగ్బంధం ఎత్తివేత
ఒప్పందంపై సంతకాలు జరిగినందున, ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నావికా దళ దిగ్బంధాన్ని 30 రోజుల్లోగా పూర్తిగా తొలగిస్తారు. అలాగే, తుది ఒప్పందం జరిగిన 30 రోజుల్లోగా ఇరాన్ సరిహద్దుల సమీపం నుంచి అమెరికా తన సైనిక బలగాలను వెనక్కి రప్పిస్తుంది.

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పునఃప్రారంభం
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి గుండా వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ తక్షణమే అనుమతించాలి. ఇందుకు ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు. ఈ ప్రాంతంలో మైన్‌లను తొలగించే ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది.

ఇరాన్ పునర్నిర్మాణానికి నిధి
యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడానికి, పునర్నిర్మాణానికి ప్రాంతీయ భాగస్వామ్య దేశాలతో కలిసి కనీసం 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 25 లక్షల కోట్లు) ప్రణాళికను సిద్ధం చేస్తారు. అయితే, ఇందులో అమెరికా తన సొంత సొమ్ము ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఇతర గల్ఫ్ దేశాల పెట్టుబడులకు అమెరికా అనుమతులు ఇస్తుంది.

ఆంక్షలు రద్దు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలతో పాటు అమెరికా ఏకపక్షంగా ఇరాన్‌పై విధించిన అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను పూర్తిగా రద్దు చేయడానికి అమెరికా అంగీకరించింది. అయితే దీని టైమ్‌లైన్ తుది ఒప్పందంలో ఖరారు కానుంది.

అణు ఆయుధాలు ఉండకూడదు
ఇరాన్ ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయకూడదు, కొనుగోలు చేయకూడదు. ఇరాన్ వద్ద ఇప్పటికే ఉన్న యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పర్యవేక్షణలో డౌన్‌బ్లెండ్ చేయాలి. ఇరాన్ దీనికి కట్టుబడి ఉంటేనే పైన పేర్కొన్న ఆంక్షల రద్దు వర్తిస్తుంది.

అణు కార్యక్రమంపై యథా స్థితి
తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ అణు కార్యక్రమంపై ‘స్టే’ (యథాతథ స్థితి) విధిస్తారు. ఈ లోగా ఇరాన్ చమురు ఎగుమతులు, బ్యాంకింగ్ లావాదేవీలు, రవాణా సేవలను పునరుద్ధరించుకోవడానికి అమెరికా తాత్కాలిక మినహాయింపులు ఇస్తుంది.

స్థంభింపజేసిన నిధుల విడుదల
ఇరాన్‌కు సంబంధించి అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా స్థంభింపజేసిన నిధులను తిరిగి ఇరాన్ వాడుకునేలా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తారు. ఇరాన్ ఒక్కో నిబంధనను అమలు చేస్తున్న కొద్దీ ఈ నిధులను విడతలవారీగా విడుదల చేస్తారు.

నిఘా వ్యవస్థ, ఐక్యరాజ్యసమితి ఆమోదంఈ ఒప్పంద నిబంధనలను ఇరు దేశాలు సరిగ్గా అమలు చేస్తున్నాయో లేదో పర్యవేక్షించడానికి ఒక ఉమ్మడి ‘నిఘా యంత్రాంగాన్ని’ ఏర్పాటు చేస్తారు. అనంతరం తుది ఒప్పందంపై చర్చలు జరిపి, చివరగా ఈ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా బైండింగ్ తీర్మానంగా ఆమోదింపజేస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment