బెజవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల (Kesineni Brothers) మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ (Cold War) ఒక్కసారిగా బహిరంగ యుద్ధంగా మారింది. విజయవాడ ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) (చిన్ని)(Chinni) లక్ష్యంగా మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (Kesineni Srinivas) (నాని)(Nani) వరుస ట్వీట్లు, ఆరోపణలతో విరుచుకుపడుతుండగా, తాజాగా ఈ వివాదం కేంద్ర దర్యాప్తు సంస్థల (ED) వరకు వెళ్ళింది. దీంతో సోషల్ మీడియాలో తనపై అసత్యాలు, అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీ కేశినేని నానిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీ ఎంపీ(TDP MP) ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు మాజీ ఎంపీ నానిపై BNS సెక్షన్లు 204, 351, 352, 353, 356, 61, సమాచార సాంకేతిక (IT) చట్టం సెక్షన్లు 66, 66(C), 66(D), 67, 72 కింద కేసు నమోదు చేశారు.
ఎంపీ కేశినేని చిన్ని అక్రమ నెట్‌వర్క్(Illegal Network), మనీ లాండరింగ్ (Money Laundering) వ్యవహారాలపై అత్యవసర దర్యాప్తు జరపాలంటూ మాజీ ఎంపీ కేశినేని నాని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కు ఒక సుదీర్ఘమైన లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి (Janaki Lakshmi), కుమారుడు వెంకట్ చౌదరిల (Venkat Chowdary) ఆర్థిక లావాదేవీలపై మనీ లాండరింగ్ కింద అత్యవసర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల టికెట్ కోసం కేశినేని చిన్ని ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivas) చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని ఈడీని కోరారు.
సుంకర రామచంద్రరావు (Sunkara Ramachandra Rao), బొల్లినేని మోహన్ రావు (Bollineni Mohan Rao) అకౌంట్లకు జరిగిన భారీ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ల గుట్టు తేల్చాలి. దుండిగల్, కర్తానూర్-పటాన్ చెరువు, గచ్చిబౌలి, బంజారా హిల్స్, శంకరపల్లి పరిధిలోని ‘కేశినేని డెవలపర్స్’ ప్రాజెక్టులలో ప్రీ-లాంచ్ పేరిట భారీ వసూళ్లకు పాల్పడి కస్టమర్లను మోసం చేశారని ఆరోపించారు. వివాదాస్పద ‘సాహితి ఇన్‌ఫ్రా స్కామ్’తో ఉన్న లింకులపై దృష్టి పెట్టాలన్నారు.
ED, NCLT, PMC బ్యాంక్ కేసుల నిఘాలో ఉండగానే ఎక్సెలా ప్రాపర్టీస్‌లో జరిగిన ప్రీ లాంచ్ సేల్స్‌పై, అలాగే 112 ఎకరాల ప్రగతి నగర్ భూమి స్కామ్‌లో సుప్రీం కోర్టును తప్పుదారి పట్టించిన అంశాలపై విచారణ జరపాలి. ఇసుక, గ్రావెల్, ఫ్లై యాష్ గనులు, జూద దందాలు, ల్యాండ్ గ్రాబింగ్ (భూ ఆక్రమణలు) లలో ఉన్న ఎంపీ నెట్‌వర్క్‌ను కట్టడి చేయాలి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) లో జరిగిన అవినీతితో పాటు, ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో జరిగిన బలవంతపు వసూళ్లపై విచారణ జరపాలన్నారు.
కేశినేని చిన్ని, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Venigandla Ramu) అమెరికా కంపెనీల ద్వారా చేస్తున్నట్లు చెబుతున్న మోసాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆస్తులను అటాచ్ చేయాలని నాని డిమాండ్ చేశారు. సోదరుల మధ్య మొదలైన ఈ రాజకీయ వైరం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల నుండి కేంద్ర దర్యాప్తు సంస్థల వరకు చేరడంతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈడీ ఈ లేఖపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.








