మ‌రో వివాదంలో జ‌న‌సేన ఎమ్మెల్యే.. క్యాంప్‌ ఆఫీస్‌లో ఏం జ‌రిగింది?

మ‌రో వివాదంలో జ‌న‌సేన ఎమ్మెల్యే.. క్యాంప్‌ ఆఫీస్‌లో ఏం జ‌రిగింది?

Summarize with AI

అవినీతి ఆరోప‌ణ‌ల‌తో (Corruption Allegations) వివాదాల్లోకి ఎక్కిన జ‌న‌సేన ఎమ్మెల్యే (Jana Sena MLA) మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారారు. అధిష్టానం సీరియ‌స్ అయిన త‌రువాత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటున్న ఎమ్మెల్యే.. మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కారు. పోలవరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balraju) క్యాంపు కార్యాలయం వేదికగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యేపై ఆయన సమీప బంధువు పూనెం వంశీ (Poonem Vamsi) అనే వ్యక్తి దాడికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం, వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ కావడంతో నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది.

గురువారం ఉదయం నుంచే “ఎమ్మెల్యే బాలరాజు క్యాంప్ కార్యాలయంలో ఆయనపై దాడి జరిగింది” అంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే సమీప బంధువు పూనెం వంశీ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు ప్రచారం జరిగింది. అయితే, కాసేపటికే వంశీ, అతని స్నేహితుడు భాషాను (Basha) ఎమ్మెల్యే అనుచరులు క్యాంప్ కార్యాలయం నుండి బయటకు తీసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.

ఆ వీడియోలో.. “ఎమ్మెల్యేను కలవడానికి వచ్చిన మహిళలపై (Womens)అనుచితంగా మాట్లాడారు.. న్యాయం అడగడానికి వచ్చిన తమపై దాడి చేస్తారా?” అంటూ వంశీ కేకలు వేయడం కనిపించింది. ఈ గందరగోళం నడుస్తుండగానే, వాట్సాప్ గ్రూపుల్లో అంతకుముందు పెట్టిన “ఎమ్మెల్యేపై దాడి” మెసేజ్‌లను కొందరు డిలీట్ చేయడంతో అసలు క్యాంపు కార్యాలయంలో ఏం జరిగిందో తెలియక ప్రజలు గందరగోళానికి గురయ్యారు.

ఈ వివాదంపై స్పష్టతనిస్తూ ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు క్యాంపు కార్యాలయం లోపల జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను విడుదల చేశాయి. వంశీ, అతని స్నేహితుడు భాషా.. క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి ఎమ్మెల్యే అనుచరులతో తీవ్రంగా ఘర్షణ పడటం, ఎమ్మెల్యేపైకి వెళ్లడానికి ప్రయత్నించడం ఆ దృశ్యాలలో స్పష్టంగా కనిపించింది. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే గన్‌మెన్(MLA Gunmen), సిబ్బంది వంశీని అడ్డుకుని అక్కడ నుంచి బయటకు పంపించేశారు.

పోలీసు వర్గాల కథనం ప్రకారం.. పూనెం వంశీ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు వ్యతిరేకంగా అసత్య ప్రచారాలు, పోస్టులు పెడుతున్నాడు. దీనిపై ఎమ్మెల్యే వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, బుధవారం జీలుగుమిల్లి పోలీసులు వంశీని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

అయితే, తన కొడుకును పోలీసులు స్టేషన్‌కు పిలవడంపై వంశీ తల్లి ఎమ్మెల్యే వద్దకు వెళ్లి నిలదీశారని.. ఆ సమయంలో ఆమె పట్ల కొందరు అనుచితంగా మాట్లాడారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి గురైన వంశీ, తన స్నేహితుడు భాషాతో కలిసి నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి నానా హంగామా సృష్టించినట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment