విశాఖ ఉక్కు కర్మాగారంలో (Vizag Steel Plant) నిన్న సాయంత్రం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి (9) చేరింది. స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1) లో జరిగిన ఈ పేలుడు ఘటనతో ప్లాంట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురు కార్మికులకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అసలేం జరిగింది..?
నిన్న సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఎస్ఎమ్ఎస్-1 (SMS-1) విభాగంలో కార్మికులు విధుల్లో ఉండగా ఈ దారుణం జరిగింది. సుమారు 1500 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతతో ఉన్న 150 టన్నుల మోల్టెన్ మెటల్ లాడెల్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఉష్ణోగ్రత తీవ్రతకు ఆ ద్రవ ఉక్కు దాదాపు 25 అడుగుల విస్తీర్ణంలో ఎగసిపడింది. సమీపంలోనే విధులు నిర్వహిస్తున్న కార్మికులపై ఈ హాట్ మెటల్ పడడంతో, వారు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అధికారులు, శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నారు. గోల్డ్ కుమార్ (మేనేజర్), జీవీ అప్పారావు (సైడ్ ఆపరేటర్), ప్రభాకరరావు (స్టాండ్ 3 ఆపరేటర్), జి.భానుకుమార్ (షిఫ్ట్ ఇన్చార్జి, స్టాండ్-D), కృష్ణ నాగు (స్టాడ్ -4 ఆపరేటర్), రమణ (పౌడర్ కలాసీ – కాంట్రాక్ట్ వర్కర్), త్రినాథ్ (స్టాండ్ ఆపరేటర్ – కాంట్రాక్టు వర్కర్), ఎన్. అప్పలరాజు (స్టాండ్ ఆపరేటర్ – కాంట్రాక్టు వర్కర్), గుర్తుతెలియని మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం.
తీవ్ర గాయాలతో కార్మికులు పైడిరాజు, రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాస్, అర్జున్ అప్పారావు, సత్యానంద్, సూరిబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, సీనియర్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ తోటి కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన SMS–1 నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్లే సరైన పర్యవేక్షణ కరువైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇదే విభాగంలో నాలుగు రోజుల క్రితమే ‘మెటల్ రన్సింగ్’ ప్రక్రియ సరిగ్గా చేయకపోవడం వల్ల హాట్ మెటల్ స్వల్పంగా ఎగసిపడిందని సీనియర్ కార్మికులు గుర్తుచేస్తున్నారు. అప్పుడు ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో యాజమాన్యం లైట్ తీసుకుందని, ఆరోజే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈరోజు 9 మంది ప్రాణాలు గాల్లో కలిసేవి కాదంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటన
ఈ ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం (నష్టపరిహారం) అందిస్తామని ప్రకటన వెలువడింది. అయితే, కేవలం నష్టపరిహారంతో సరిపెట్టకుండా, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని స్థానిక నేతలు కోరుతున్నారు.








