ప్రియుడి కోసం ఆరేళ్ల కుమార్తెను హత్య చేసిన తల్లి!

ప్రియుడి కోసం ఆరేళ్ల కుమార్తెను హత్య చేసిన తల్లి!

కన్నప్రేమను మరిచి, కట్టుకున్న భర్తను వదిలేసి.. ప్రియుడితో సహజీవనానికి (Live-in Relationship) అడ్డొస్తోందని ఆరేళ్ల కన్నకూతుర్నే ఓ తల్లి దారుణంగా హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో చనిపోయిందంటూ కథ అల్లి, తప్పుడు పోస్ట్‌మార్టమ్ రిపోర్టుతో తప్పించుకోవాలని చూసింది. కానీ, భర్తకు వచ్చిన ఒక అనుమానం ఈ ఘోర నిజాన్ని బయటపెట్టింది.

పోలీసుల కథనం ప్రకారం.. బెంగ‌ళూరులోని (Bengaluru) దావణగెరెకు చెందిన ప్రవీణ్(Praveen), ప్రియాంకలకు (Priyanka) 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (15), కుమార్తె (6) సంతానం. కొంతకాలంగా ఈ కుటుంబం బెంగళూరులోని కాడుగోడి ప్రాంతంలో నివసిస్తోంది. ఈ క్రమంలో ప్రియాంకకు ఆమె బాల్య స్నేహితుడు మోహన్ (Mohan) మళ్లీ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా గత రెండేళ్లుగా వివాహేతర సంబంధానికి దారితీసింది.

భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రవీణ్, ఆమెను గట్టిగా మందలించాడు. దీంతో ప్రియాంక తన 15 ఏళ్ల కుమారుడిని భర్త వద్దే వదిలేసి, ఆరేళ్ల కుమార్తెను తీసుకుని ప్రియుడు మోహన్‌తో కలిసి వెళ్ళిపోయింది. వీరిద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం ప్రారంభించారు. మూడు నెలల క్రితం ప్రియాంక తన భర్త ప్రవీణ్‌కు ఫోన్ చేసి, కుమార్తెకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని చెప్పింది. పోస్ట్‌మార్టమ్ నివేదికను (Postmortem Report) కూడా ప్రవీణ్‌కు పంపించి నమ్మించే ప్రయత్నం చేసింది.

కుమార్తె మరణాన్ని తట్టుకోలేకపోయిన ప్రవీణ్‌కు భార్య ప్రవర్తనపై, ఆ రిపోర్టుపై అనుమానం వచ్చింది. దీంతో అతను ఆ పోస్ట్‌మార్టమ్ నివేదికను విదేశాల్లో ఉంటున్న తన స్నేహితుడైన ఒక వైద్యునికి పంపించాడు. ఆ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన ఆ డాక్టర్.. “ఈ నివేదికలో చాలా తప్పులు ఉన్నాయి. పాప ఆహారం వికటించి చనిపోలేదు. ఎవరో ఊపిరాడకుండా చేసి హత్య(Murder) చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి తప్పుడు నివేదికను సృష్టించారు” అని ప్రవీణ్‌కు అసలు నిజం చెప్పాడు.

స్నేహితుడి మాటలతో షాక్‌కు గురైన ప్రవీణ్.. తక్షణమే కాడుగోడి పోలీస్ స్టేషన్‌కు (Kadugodi Police Station) వెళ్లి భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్‌పై ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల రాకను గమనించిన కిరాతక తల్లి ప్రియాంక అక్కడి నుంచి పరారవ్వగా, ఆమె ప్రియుడు మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బులకు ఆశపడి హత్యను సహజ మరణంగా చిత్రీకరిస్తూ తప్పుడు పోస్ట్‌మార్టమ్ నివేదిక ఇచ్చిన సదరు ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న తల్లి ప్రియాంక కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment