తమిళనాడులో ‘ఫీజుల బోర్డులు’.. ఏపీలో సాధ్యమేనా..?

తమిళనాడులో 'ఫీజుల బోర్డులు'.. ఏపీలో సాధ్యమేనా..?

తమిళనాడులో ఇటీవల విద్యాశాఖ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా.. ప్రతి ప్రైవేట్ స్కూల్ తమ ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులపై, వెబ్‌సైట్లలో బహిరంగంగా ప్రదర్శించాలంటూ తమిళనాడు విద్యాశాఖ జూన్ మొదటి వారంలో కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సీఎం విజయ్ ప్రభుత్వ విద్యా సంస్కరణల ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. “ఇలాంటి బోర్డులు మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తాయా?” అనే ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఏపీలో కార్పొరేట్ విద్యాసంస్థల ‘రాజకీయం’
తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడ కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలే పాలకుల పాత్ర పోషిస్తున్నారు. ఎంపిక చేసిన కొన్ని పెద్ద విద్యాసంస్థల యజమానులే ఇక్కడ అధికార పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా, లోక్‌సభ ఎంపీలుగా, కీలక మంత్రులుగా చలామణి అవుతున్నారు. విద్యా వ్యవస్థను నడిపించే శక్తులే నేరుగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు, వారి వ్యాపార ప్రయోజనాలకు గండి కొట్టేలా ఫీజుల నియంత్రణ జరుగుతుందా? అన్నది సామాన్యుడి సందేహం.

పొరుగు రాష్ట్రంలో సీఎం విజయ్ ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడానికి సాహసోపేతమైన అడుగులు వేస్తుంటే.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తెచ్చే సాహసం చేస్తుందా అంటే.. ఒకవేళ అలా చేస్తే సొంత పార్టీలోని పారిశ్రామికవేత్తలు, మంత్రుల నుంచే తీవ్ర వ్యతిరేకత తప్పదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

నాడు ‘జీవో 28’.. నేడు..!
గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు స్పష్టమైన ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగానే ‘జీవో నంబర్ 28’ విడుదల చేసి, ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పాఠశాలల మౌలిక వసతులను బట్టి ఫీజులను నిర్ణయించేలా ఆ కమిటీ కసరత్తు చేసింది. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కమిటీ ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కమిటీని పక్కన పెట్టేసిందనే ఆరోపణలు తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ బడులకు దీటుగా మార్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, మౌలిక వసతుల కల్పనతో స‌ర్కారు బడుల స్వరూపాన్నే మార్చేశారు. దీనివల్ల మధ్యతరగతి, పేద వర్గాలు కార్పొరేట్ వైపు వెళ్లకుండా ప్రభుత్వ బడుల బాట పట్టాయి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘నాడు-నేడు’ పథకం నిలిచిపోయింది. మ‌ళ్లీ కార్పొరేట్ స్కూళ్ల హ‌వా కొన‌సాగుతోంది. బుక్స్, యూనిఫామ్స్, డొనేషన్ల పేరుతో తల్లిదండ్రులపై మోయలేని భారం వేస్తున్నారని, తమ బాధలు వినేవారే కరువయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్కూల్ టాపర్లను ప్రకటనల్లో చూపిస్తూ ప్రభుత్వ విద్యను మెరుగుపరుస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కార్పొరేట్ ఫీజుల దోపిడీని అరిక‌ట్ట‌లేక‌పోతున్నారనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే, ఆయా కార్పొరేట్ స్కూళ్లన్నీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలవే కావడం ఇక్కడ గమనార్హం.

తల్లిదండ్రులకు గుదిబండగా మారిన ఈ ఫీజుల దోపిడీని అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తుందా? పొరుగు రాష్ట్ర సీఎం విజయ్ మాదిరిగా ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నోటీస్ బోర్డులపై పెట్టించే దమ్ము, ధైర్యం ప్రదర్శిస్తుందా? వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment