టీమిండియా టీ20 జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంటూ కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు జట్టును నడిపించిన సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్‌కు పగ్గాలు అప్పగించగా, యువ స్టార్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల్లోనూ అయ్యర్ జట్టును నడిపించనున్నాడు.
అయితే ఈ జట్టు ఎంపికలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు వైభవ్ సూర్యవంశీది. ఐపీఎల్-2026లో అద్భుత ప్రదర్శనతో మెరిసిన ఈ 15 ఏళ్ల యువ సంచలనం భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో అత్యంత పిన్న వయస్సులో భారత జట్టుకు ఎంపికైన ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా, ఇప్పుడు సూర్యవంశీ ఆ ఘనతను అధిగమించాడు. అతడి ఎంపిక భారత క్రికెట్లో కొత్త యుగానికి నాంది పలుకుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. అనుభవం, యువత కలయికతో కూడిన ఈ జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఎలా రాణిస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం భారత క్రికెట్లో అత్యంత ఆసక్తికర అంశంగా మారింది.








