ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ (Rajya Sabha) స్థానాల ఎన్నికల పర్వం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కూటమి వాటాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party – TDP) మూడు, జనసేనకు ఒక స్థానం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, జనసేన పార్టీకి దక్కిన ఆ ఒక్కగానొక్క తొలి రాజ్యసభ స్థానాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు (Lingamaneni Ramesh) కేటాయిస్తూ ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు జనసేన(Jana Sena) శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కనబెట్టి, టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడికి (Nara Chandrababu Naidu) అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ‘జనసైనికులు'(Janasainiks) లోలోపల రగిలిపోతున్నారు.
కూటమి లెక్కల ప్రకారం నాలుగు స్థానాల్లో మూడు టీడీపీ, ఒకటి జనసేన పంచుకున్నాయి. కానీ, సామాజిక మాధ్యమాల్లో, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఆ నాలుగు సీట్లలోనూ టీడీపీ వ్యక్తులే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు తన అత్యంత ఆప్తుడైన లింగమనేని రమేష్‌కు జనసేన కోటాలో సీటు ఇప్పించుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. “సోషల్ ఇంజనీరింగ్” (Social Engineering) (సామాజిక సమీకరణాల) కోసమే లింగమనేనికి అవకాశం ఇచ్చామని జనసేన ప్రకటించినప్పటికీ, క్యాడర్ మాత్రం ఈ వివరణతో సంతృప్తి చెందడం లేదు.

లింగమనేని రమేష్ పేరు వినబడగానే అందరికీ గుర్తొచ్చేది కరకట్టపై ఉన్న ఆయన గెస్ట్ హౌస్. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భవనాన్నే తన అధికారిక నివాసంగా ఉపయోగించారు. గతంలో ఇదే లింగమనేని భవనం అక్రమ కట్టడమని నాటి టీడీపీ ప్రభుత్వమే నిర్ధారించింది. ఆ తర్వాత వైసీపీ (YSRCP) హయాంలోనూ దీనిపై పెద్ద ఎత్తున వివాదం నడిచింది. గతంలో సంచలనం సృష్టించిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో (Amaravati Inner Ring Road Scam) హెరిటేజ్ సంస్థతో (Heritage Foods) పాటు లింగమనేని గ్రూప్‌నకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి.
లింగమనేని రమేష్ రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నివాసం, జనసేన కేంద్ర కార్యాలయం నడుస్తున్నాయి. 2015 నుంచి ఆయన పవన్‌కు అండగా ఉన్నారని జనసేన చెబుతున్నప్పటికీ, ఆయన అసలు గుర్తింపు మాత్రం చంద్రబాబు అనుచరుడిగానే ప్రచారంలో ఉంది.

మింగుడుపడని నిర్ణయం..
పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో ఆవాంతరాలను తట్టుకుని, లాఠీ దెబ్బలు తిని, కేసులను ఎదుర్కొంటూ జనసేన జెండాను మోసిన నిజమైన కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు ఈ తొలి రాజ్యసభ సీటు దక్కి ఉంటే బాగుండేదని క్యాడర్ భావిస్తోంది. పార్లమెంట్‌లో జనసేన గొంతుకను బలంగా వినిపించే నాయకుడిని కాకుండా, వ్యాపారవేత్తను ఎంపిక చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
“ఎమ్మెల్యేల్లో సగం మంది టీడీపీ నుంచి వచ్చినవారే.. నామినేటెడ్ పదవుల్లోనూ వారికే ప్రాధాన్యత.. ఇక పార్టీకి దక్కిన ఏకైక తొలి రాజ్యసభ సీటును కూడా టీడీపీకి అత్యంత సన్నిహితుడికే రాసిచ్చేస్తే.. మరి పార్టీ కోసం పనిచేసిన మా పరిస్థితి ఏంటి?” అని జనసేన కిందిస్థాయి క్యాడర్ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి జనసేన తీసుకున్న ఈ తొలి రాజ్యసభ అభ్యర్థి నిర్ణయం కూటమిలో సజావుగానే సాగినప్పటికీ.. జనసేన అంతర్గత రాజకీయాల్లో, సోషల్ మీడియా వేదికల్లో మాత్రం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.









