‘చిన్ని చీకటి సామ్రాజ్యం.. భయం నీడలో బెజవాడ’

‘చిన్ని చీకటి సామ్రాజ్యం.. భయం నీడలో బెజవాడ’

బెజవాడ రాజకీయంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య మ‌రోసారి అగ్గిరోజుకుంటోంది. కేశినేని బ్రదర్స్ మధ్య నడుస్తున్న అంతర్గత యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పీక్ స్టేజ్‌కు చేరింది. విజయవాడ ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్)పై ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేల్చిన బాంబులు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. “చిన్ని చీకటి సామ్రాజ్యం.. భయం నీడలో బెజవాడ” అంటూ కేశినేని నాని పెట్టిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

విజయవాడలో ఎంపీ చిన్ని అరాచకాలు నడుస్తున్నాయని, ఇసుక రేషన్ నుంచి మొదలుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, అక్రమ వసూళ్ల దందా సాగుతోందని నాని పేర్కొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA)లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని మండిపడ్డారు. బెజవాడలోని ప్రధాన వాణిజ్య సముదాయాలు, విలువైన ఆస్తి విభాగాల సెటిల్మెంట్లలో సైతం చిన్ని జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.

యాసిడ్ పోసి హింసించారు..
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అఫీషియల్ కార్యాలయంలో రూ.27 కోట్ల బ్లాక్ మ‌నీ దొంగతనం జరిగిందని, ఈ దొంగతనంతో సంబంధం ఉన్న ఆయన పీఏలు, కార్యాలయ సిబ్బంది మోహన్, పొన్నం రాజేష్, రామచంద్ర, అంజి, హైదరాబాద్‌కు చెందిన నాగ శ్రీనివాసులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఓ వ్యక్తిని పట్టుకొచ్చి అతని చేతులపై యాసిడ్ పోసి దారుణంగా హింసించారంటూ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. అధికార యంత్రాంగాన్ని, రాజకీయ ప్రభావాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు చర్యలు తీసుకోరా..
రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబుపై కేశినేని చిన్ని అక్రమంగా కేసులు పెట్టించి తీవ్రంగా వేధిస్తున్నారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ అంశాలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. టీడీపీ ఎంపీ అరాచకాల నుంచి విజయవాడ ప్రజలను, అమాయకులను రక్షించాలి” అంటూ కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా సీఎం చంద్రబాబుకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. ఈ వరుస ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టులతో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment