సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆరోగ్యంపై (Health) అసత్య ప్రచారాలు చేస్తూ, మార్ఫింగ్ వీడియోలను వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమాజంలో గౌరవం, అభిమానాన్ని సంపాదించుకున్న ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన సదరు ఛానల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలకు పోలీసులు ఉపక్రమించారు.
పోలీసుల కథనం ప్రకారం.. కమలాపురి కాలనీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామకృష్ణ మిర్యాల (Ramakrishna Miryala) ఈ వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ చిరంజీవి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తిగా అవాస్తవమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను రూపొందించి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాజంలో అనవసర గందరగోళాన్ని సృష్టించేలా, లక్షలాది మంది అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసేలా ఉన్న మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలను సదరు ఛానల్ వ్యూస్ కోసం వైరల్ చేసిందని వివరించారు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రాథమిక పరిశీలన జరిపారు. అనంతరం న్యాయపరమైన నిబంధనల ప్రకారం కోర్టు అనుమతిని తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు.








