ఇది ‘రాజకీయ గూండాయిజం’.. ప్రొ.నాగేశ్వర్‌రావుకు ప్రకాష్ రాజ్ మద్దతు

ఇది 'రాజకీయ గూండాయిజం'.. ప్రొ.నాగేశ్వర్‌రావుకు ప్రకాష్ రాజ్ మద్దతు

Summarize with AI

ప్రముఖ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌రావుపై (Professor K. Nageshwar Rao) సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, పోలీస్ కేసుల వ్యవహారంపై వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంలో ప్రొఫెసర్‌కు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. నాగేశ్వర్‌రావును (Nageshwar Rao) లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను “రాజకీయ గూండాయిజం”(Political Goondaism)గా ప్రకాష్ రాజ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.

ఒక లైన్ పట్టుకుని వ్యక్తిత్వ హననమా?
నాగేశ్వర్‌రావు సంవత్సరాలుగా ప్రజా పక్షాన నిలబడి, అధికారంలో ఉన్నవారినైనా, ప్రతిపక్షంలో ఉన్నవారినైనా నిలదీస్తూ వస్తున్నారని ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు. “ప్రొఫెసర్ మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి.. అందులో ఒకే ఒక్క లైన్ మాత్రమే పట్టుకుని, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, కేసులు పెట్టడం, బెదిరింపులకు దిగడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనే రాజకీయ గూండాయిజమా?” అని ప్రకాష్ రాజ్ నిలదీశారు. ఒకవేళ ఆయన మాట్లాడిన మాట తప్పనిపిస్తే, దానికి ఆధారాలు అడగాలని లేదా రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలి తప్ప.. వ్యక్తిత్వ హననం చేయడం, కేసులతో భయపెట్టడం సరికాదని మండిపడ్డారు. ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? అంటూ ప్రశ్నించారు.

ఆ నిజాయితీ గుర్తుకురాలేదా?
గతంలో నాగేశ్వర్‌రావు వివిధ రాజకీయ పార్టీల అధినేతలను ప్రశ్నించిన తీరును ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. “నాగేశ్వర్‌రావు చంద్రబాబుని(Chandrababu Naidu), పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan), కేసీఆర్‌ను(KCR), జగన్‌ని(YS Jagan), రేవంత్ రెడ్డిని(Revanth Reddy) ప్రశ్నించారు. బీజేపీని(BJP)సైతం ఎన్నో ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకురాలేదా? ఇప్పుడు కేవలం ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా?” అని ప్ర‌శ్నించారు.

ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం సమాజానికి అత్యంత ప్రమాదకరమని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. ఈరోజు నాగేశ్వర్‌రావుపై జరుగుతున్న దాడులు, రేపు ఇంకెవరి మీదైనా జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు ఎవరి పట్టులో ఉన్నారనే విషయాలు ప్రజలందరికీ అన్నీ తెలుసంటూ ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment