అమెరికా–ఇరాన్ (American-Iran) మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. “యుద్ధమా(War).. లేక శాంతి ఒప్పందమా(Peace Deal)?” అనే పరిస్థితి నెలకొన్న వేళ, మరో కొన్ని రోజుల్లోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. ఇరాన్ నుంచి స్పష్టమైన మరియు సానుకూల సమాధానాలు రావాలని కోరిన ట్రంప్, లేదంటే అమెరికా కఠిన చర్యలకు వెనుకాడదని స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (Recep Tayyip Erdogan) తో కూడా ట్రంప్ చర్చలు జరిపారు. ఈ దౌత్యపరమైన చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో పెద్ద ముప్పు తప్పుతుందనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కూడా గణనీయంగా తగ్గాయి.
అయితే అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. ఒకవేళ అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగితే, దాని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం “పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ”(Persian Gulf Strait Authority) ని ఏర్పాటు చేసినట్లు కూడా ప్రకటించింది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian), పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీతో (Mohsin Naqvi) సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. దౌత్య చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం సాధ్యమని, ఒత్తిడితో ఇరాన్‌ను లొంగదీసుకోవాలనుకోవడం అమెరికా భ్రమ మాత్రమేనని పెజెష్కియాన్ స్పష్టం చేశారు.








