ఐపీఎల్లో(IPL) భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మైదానంలో ఆట పరంగానే కాదు, ఆటగాళ్ల మధ్య ఆవేశకావేశాలకూ వేదికైంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆటగాళ్లు సైతం నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లడంతో స్టేడియంలో కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సన్‌రైజర్స్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen), చెన్నై వికెట్ కీపర్ సంజు శాంసన్ (Sanju Samson) మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఈ హైడ్రామా చోటు చేసుకుంది. చెన్నై స్పిన్నర్(CSK) నూర్ అహ్మద్ (Noor Ahmad) బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే క్లాసెన్ కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతూ మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పేస్తున్నాడు.
ఈ దశలో నూర్ అహ్మద్ సంధించిన ఓ అద్భుతమైన గూగ్లీని క్లాసెన్ ఆడబోయాడు. అయితే బంతి అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ దాటిపోగా.. క్లాసెన్ క్రీజ్ వెలుపలికి వచ్చాడు. వికెట్ల వెనక ఉన్న సంజు శాంసన్ మెరుపువేగంతో బంతులను అందుకుని బెయిల్స్ ఎగరగొట్టాడు. థర్డ్ అంపైర్ రీప్లేలో క్లాసెన్ పాదం గాల్లో ఉండటం స్పష్టమవడంతో అంపైర్లు దానిని స్టంప్ ఔట్‌గా ప్రకటించారు.

సంజు శాంసన్ చేసిన ఈ స్టంపింగ్ (Stumping) చేపాక్ స్టేడియంలో లెజెండరీ కీపర్ ఎంఎస్ ధోనీని (MS Dhoni) గుర్తు చేసింది. అయితే, క్లాసెన్ అవుట్ అయిన వెంటనే సంజు శాంసన్ కాస్త దూకుడుగా సెలబ్రేట్ చేసుకుంటూ క్లాసెన్ వైపు తీక్షణంగా చూశాడు. కీలక సమయంలో అవుట్ అయ్యాననే తీవ్ర అసహనంలో ఉన్న క్లాసెన్‌కు ఇది మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
పెవిలియన్‌కు వెళ్లే ముందు క్లాసెన్ నేరుగా సంజు శాంసన్ వద్దకు వెళ్లాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రారంభంలో సాధారణంగానే అనిపించినప్పటికీ.. చూస్తుండగానే ఇద్దరి హావభావాలు మారిపోయాయి. క్లాసెన్ ముందుకు వెళ్ళి, మళ్ళీ వెనక్కి తిరిగి శాంసన్ వైపు వస్తూ వేలు చూపిస్తూ ఏదో అనడంతో గ్రౌండ్ లో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

పరిస్థితి చేయిదాటుతుందని గమనించిన మైదానంలోని అంపైర్లు తక్షణమే ఇద్దరి మధ్యలోకి వచ్చారు. మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా సంజు శాంసన్‌ను ప్రశాంతంగా ఉండమని అంపైర్లు సూచించారు. అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివం దూబే (Shivam Dube) వెంటనే స్పందించి హెన్రిచ్ క్లాసెన్‌ను శాంతింపజేస్తూ, అతడి భుజంపై చేయి వేసి పెవిలియన్ వైపు పంపించడంతో వివాదం సర్దుమణిగింది.
క్లాసెన్, సంజు శాంసన్ల మధ్య జరిగిన ఈ తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై క్రికెట్ అభిమానులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సంజు శాంసన్ మెరుపు స్టంపింగ్ నైపుణ్యాన్ని కొనియాడుతుండగా.. మైదానంలో ఎప్పుడూ కూల్‌గా ఉండే సంజు, క్లాసెన్ ఈ స్థాయిలో గొడవకు దిగడం ఆశ్చర్యపరిచిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో క్లాసెన్ అవుట్ అయినప్పటికీ, ఇషాన్ కిషన్ (70 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.









అన్నపై పరోక్ష కౌంటరా?.. మనోజ్ వ్యాఖ్యలపై చర్చ