భారతదేశ టూరిస్ట్ (India Tourist) ప్లేస్‌గా పిలవబడే గోవాలోని (Goa) ప్రముఖ పలోలెం బీచ్ మధ్యాహ్నం వేళ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ.. సముద్రపు అలల మధ్య కేరింతలు కొట్టే పర్యాటకుల సందడి ఏమాత్రం తగ్గలేదు. బీచ్ (Beach) వెంబడి ఉండే షాక్‌లు (Shacks), బడ్జెట్ హోటళ్లు (Budget Hotels) అన్నీ పర్యాటకులతో నిండిపోయాయి.
అయితే, కొన్ని సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇక్కడో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు గోవా తీరాల్లో విపరీతంగా కనిపించే యూరప్ (Europe), రష్యా (Russia) పర్యాటకులు ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. బీచ్‌లలో కనిపిస్తున్న గుంపులన్నీ దాదాపు మన దేశీయ పర్యాటకులే. విదేశీయులను ఆకర్షించడంలో గోవా తన పట్టు కోల్పోతుండగా, దేశంలోని మూలమూలల నుండి వచ్చే స్వదేశీ పర్యాటకులకు మాత్రం ఇది ప్రధాన కేంద్రంగా మారుతోంది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?
గోవా పర్యాటక శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయి. 2017లో దాదాపు 9,00,000 మంది విదేశీయులు గోవాను సందర్శించగా, 2025 నాటికి ఆ సంఖ్య దాదాపు 5,20,000కు పడిపోయింది. మరోవైపు దేశీయ పర్యాటకుల సంఖ్య 2016లో 6.8 మిలియన్లు ఉండగా, గత ఏడాది (2025) నాటికి అది ఏకంగా 1 కోటికి (10 మిలియన్లు) పైగా చేరింది.
ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు (Geopolitical situations) విదేశీ పర్యాటకుల రాకపై ప్రభావం చూపుతున్నాయని గోవా పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే స్థానిక మీడియాతో పేర్కొన్నారు. అయితే, ఈ తగ్గుదల ప్రస్తుత యుద్ధ వాతావరణం కంటే ముందే ప్రారంభమవడం గమనార్హం. 1960, 70ల నాటి హిప్పీ సంస్కృతి నుండి గోవాను ఆదరిస్తున్న విదేశీయులు ఇప్పుడు ఎందుకు దూరమవుతున్నారు?
యూరప్ పర్యాటకుల ప్రకారం.. భారతదేశానికి వచ్చేందుకు వీసా ప్రక్రియ సుదీర్ఘంగా, క్లిష్టంగా మారడం, ఐదేళ్ల వీసా ఫీజులు పెంచడం పర్యాటకులను నిరుత్సాహపరుస్తోంది. వియత్నాం, శ్రీలంక వంటి దేశాలు ఆన్-అరైవల్ (వచ్చిన వెంటనే) వీసాలు ఇస్తుండటంతో పర్యాటకులు అటువైపు మొగ్గు చూపుతున్నారు.

లండన్ గాట్విక్ నుండి గోవాకు ఉన్న డైరెక్ట్ ఎయిర్ ఇండియా విమాన సర్వీసును రద్దు చేయడం కూడా బ్రిటిష్ పర్యాటకులపై ప్రభావం చూపింది. ఇప్పుడు వారు ముంబై మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్లలో రావాల్సి వస్తోంది.
బీచ్‌లను శుభ్రంగా ఉంచుతున్నప్పటికీ, బీచ్‌లకు వెళ్లే రహదారుల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం విదేశీయులకు నచ్చడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా గోవాలో ‘టాక్సీ యూనియన్ల’ గొడవ పెద్ద సమస్యగా మారింది. ఓలా, ఉబెర్ వంటి యాప్ ఆధారిత సేవలను స్థానిక యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో, పర్యాటకులు విపరీతమైన టాక్సీ ఛార్జీలు భరించాల్సి వస్తోంది.
స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
విదేశీ పర్యాటకులు తగ్గడం వల్ల హోటల్ వ్యాపారులతో పాటు స్థానిక వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. దేశీయ పర్యాటకులు హోటల్ ప్యాకేజీలకే పరిమితమైతే, విదేశీ పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేస్తూ, స్థానిక బైక్‌లను అద్దెకు తీసుకుని, స్థానిక రెస్టారెంట్లలో తింటూ ఎక్కువ ఖర్చు పెడతారు. వారి సంఖ్య తగ్గడం వల్ల స్థానిక వ్యాపారుల ఆదాయం పడిపోతోందని బీబీసీ తన కథనంలో పేర్కొంది.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
గోవా ప్రభుత్వం ఆలస్యంగానైనా మేల్కొని విదేశీ పర్యాటకులను తిరిగి ఆకర్షించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే పోలాండ్‌లో రోడ్‌షోలు నిర్వహించగా, తదుపరి స్కాండినేవియా దేశాలపై దృష్టి పెట్టారు. అలాగే ఆసియా, ఆఫ్రికా దేశాల నుండి పర్యాటకులను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయినప్పటికీ, ఆసియా వ్యాప్తంగా చౌక అయిన, పరిశుభ్రమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో.. విదేశీ పర్యాటకులను మళ్లీ తనవైపు తిప్పుకోవడానికి గోవా చాలా కష్టపడాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.








