విజ‌య్‌తో ప‌వ‌న్‌కు పోలికే లేదా..? ఎవరి బలమెంతో తెలుసా!

విజ‌య్‌తో ప‌వ‌న్‌కు పోలికే లేదా..? ఎవరి బలమెంతో తెలుసా!

Summarize with AI

సినిమా గ్లామర్‌తో రాజకీయాల్లోకి రావడం సౌత్ ఇండియాలో కొత్తేమీ కాదు. కానీ, వచ్చిన తర్వాత ప్రజల్లో పట్టు సాధించి, అధికారం వైపు అడుగులు వేయడంలోనే అసలైన నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ప్రస్తుతం సౌత్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన పోలిక.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వర్సెస్ తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్(Vijay). ఇద్దరూ భారీ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోలే.. కానీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్స్ చూస్తే మాత్రం ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

సభ్యత్వాల్లో ‘విజయ్’ ప్రభంజనం.. జనానికి దూరమైన ‘జనసేన’?
పార్టీ బలాన్ని అంచనా వేయడానికి ప్రాథమిక కొలమానం సభ్యత్వాల సంఖ్య. విజయ్ తన టీవీకే (TVK) పార్టీని స్థాపించిన కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే ఏకంగా 1 కోటి 80 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించి త‌మిళ‌నాట త‌న మార్క్ రికార్డు సృష్టించారు.

కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని (Jana Sena Party) స్థాపించి పుష్కర కాలం (12 ఏళ్లు) దాటినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఇప్పటివరకు కనీసం 15 లక్షల సభ్యత్వాలు కూడా దాటలేదన్నది వాస్తవం. ఇటీవలి ఎన్నికల అనంతరం జనసేన నేతలు చెబుతున్న లెక్కల ప్రకారం ఆ పార్టీ సభ్యత్వాలు సుమారు 12.98 లక్షలు (దగ్గరదగ్గరగా 13 లక్షలు) మాత్రమే. ఇందులో కూడా సినిమా ప్రభావం ఎక్కువగా ఉండే తెలంగాణ (Telangana) వాటాను తీసేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జనసేనకు మిగిలే అసలైన క్యాడర్ బలం ఎంత? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తొలి అడుగులోనే ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ’.. పదేళ్లయినా పొత్తులపైనే!
ఎన్నికల బరిలో నిలిచి గెలవడంలో విజయ్ చూపించిన వ్యూహాత్మక చొరవ తమిళ రాజకీయాలనే మార్చేసింది. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్.. మొత్తం 234 స్థానాలకు గానూ తన అభ్యర్థులను నిలిపి, ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకున్నారు. తద్వారా 60 ఏళ్ల ద్రావిడ పార్టీల (Dravidian Parties) ఆధిపత్యానికి గండి కొట్టి, తమిళనాడులో ‘సింగిల్ లార్జెస్ట్ పార్టీ’గా (Single Largest Party) అవతరించి ముఖ్యమంత్రి (Chief Minister) పీఠాన్ని అధిష్టించారు.

దీనికి పూర్తి భిన్నంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్థానం సాగింది. 2014 మార్చిలో స్థాపించిన జనసేన పార్టీ, ఆ ఏడాది ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. కేవలం టీడీపీ-బీజేపీ(TDP-BJP) కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారానికే పరిమితమైంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వామపక్షాలు (సీపీఐ (CPI), సీపీఎం(CPM)), బీఎస్పీతో (BSP) జతకట్టి బరిలోకి దిగినా.. పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. ఇక పార్టీ స్థాపించిన పదేళ్లకు.. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీతో పొత్తు పెట్టుకుని, కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి గెలిచారు. అదీ పొత్తులో భాగంగానే గెలిచార‌న్న విమ‌ర్శ ఉంది. 175 స్థానాలున్న ఏపీలో జనసేన ఇప్పటివరకు సొంతంగా మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన దాఖలాలే లేవు. పైగా 2024 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓటు షేర్ కేవలం 6 శాతం మాత్రమే కావడం గమనార్హం.

విజయ్ హుందాతనం.. పవన్ అస్థిరత!
విజయ్ తన రాజకీయ ఎంట్రీని అత్యంత ప్రణాళికాబద్ధంగా మలచుకున్నారు. పార్టీ అనౌన్స్ చేయగానే సంస్థాగత నిర్మాణం, అనుబంధ కమిటీల భర్తీ, క్యాడర్‌కు ఐడీ కార్డుల జారీ వంటి పనులను వేగంగా పూర్తి చేశారు. సమాంతరంగా పబ్లిక్ మీటింగ్స్ పెడుతూ ప్రజల్లో అటెన్షన్ గ్రాబ్ చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా, విజయ్ తన ప్రచారంలో ఎక్కడా ప్రత్యర్థులపై బూతులు మాట్లాడలేదు, సినిమా డైలాగులు కొట్టలేదు. కుల, మతాల ప్రస్తావన లేకుండా, హావభావాల్లో అతి లేకుండా వినయంగా ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడిగారు.

కానీ, పవన్ కళ్యాణ్ ప్రవర్తన, సిద్ధాంతాలు నిలకడలేకుండా సాగాయనే విమర్శలు ఉన్నాయి. మొదట ‘చెగువేరా’ అంటూ సోషలిజం మాట్లాడారు, ఆ తర్వాత వామపక్షాలతో చేతులు కలిపారు. తీరా ఎన్నికల్లో ఓడిపోయాక కులాల ప్రస్తావన తెచ్చి.. “కనీసం కుల భావ‌న తెచ్చుకొని అయినా నన్ను గెలిపించాల్సింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత రూట్ మార్చి 2024 ఎన్నికల నాటికి ‘సనాతన ధర్మం’ అంటూ సరికొత్త అవతారం ఎత్తారు.

ఆత్మపరిశీలన అవసరమా?
తమిళనాడులో విజయ్(Vijay) సాధించిన విజయంతో తనను పోల్చవద్దని పవన్ కళ్యాణ్ స్వయంగా చెబుతున్నప్పటికీ.. పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌లో ఇద్దరి కంపారిజన్ మాత్రం తప్పడం లేదు. ఒకే రకమైన స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ.. స్థితప్రజ్ఞత, స్థిరమైన ఆలోచనలు, బలమైన సిద్ధాంతాల విషయంలో విజయ్ సాధించిన రాజకీయ మైలేజీని పవన్ కళ్యాణ్ అందుకోలేకపోయారనేది పచ్చి నిజం. కేవలం పొత్తులపైనే ఆధారపడుతూ, సీట్ల సంఖ్యను తగ్గించుకుంటూ వెళ్తున్న జనసేన శ్రేణులు.. ఇప్పటికైనా దళపతి విజయ్ రాజకీయ వ్యూహాలను చూసి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment