ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా ఏపీఎస్‌ ఆర్టీసీ.. చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా ఏపీఎస్‌ ఆర్టీసీ.. చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో మ‌ళ్లీ ప్రైవేటీకరణ (Privatization) గుబులు మొద‌లైంది. ఆర్టీసీ ప్రైవేటీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి భారీ మార్పులకు శ్రీకారం చుడుతూ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. విద్యుత్ బస్సుల (Electric Buses) కొనుగోలు, నిర్వహణ భారాన్ని మోసే పరిస్థితిలో ప్రభుత్వం లేదంటూ ఆయన చేసిన ప్రకటనలు ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర కలవరానికి దారి తీస్తున్నాయి.

10 వేల విద్యుత్ బస్సులు.. రూ.17 వేల కోట్ల భారం!
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రైవేటీక‌ర‌ణ (RTC Privatization) త‌ప్ప‌నిస‌రి అంటూ బాంబు పేల్చారు. సంస్థను ఆధునీకరించే క్రమంలో కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న దాదాపు 10 వేల బస్సులను పూర్తిగా ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని, అయితే ఇందుకు ఏకంగా రూ.17,000 కోట్ల భారీ నిధులు అవసరమవుతాయని స్పష్టం చేశారు. అంతటి భారీ మొత్తాన్ని వెచ్చించి కొత్త బస్సులు కొనే ఆర్థిక స్థితిలో ప్రస్తుతం ఆర్టీసీ లేదని ఆయన తేల్చి చెప్పారు.

‘స్త్రీ శక్తి’ పథకంతో పెరిగిన ఆర్థిక భారం
రాష్ట్రంలో మహిళల కోసం ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ (Stree Shakti) పథకం కారణంగా ఆర్టీసీపై మునుపెన్నడూ లేనంతగా ఆర్థిక భారం పెరిగిందని చైర్మన్ వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం సొంతంగా విద్యుత్ బస్సులు కొనుగోలు చేయడం కంటే, ప్రైవేట్ ఆపరేటర్ల (PPP విధానం) ద్వారా వాటిని నడపడమే సంస్థకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 1,050 ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అందులో 750 బస్సులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు.

కార్మికుల్లో తీవ్ర అసహనం
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఆర్టీసీ కార్మికుల విన్నపాన్ని మన్నించి, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. తద్వారా వేలాది మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వారికి భద్రత కల్పించారు.

అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ బస్సుల నిర్వహణ, పీపీపీ (ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్)(PPP) పేరుతో మళ్లీ ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపునకే నడిపిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వంలో విలీనమైన సంస్థను క్రమంగా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పెట్టేందుకే ఈ ఎలక్ట్రికల్ బస్సుల టెండర్ల డ్రామా అని వారు మండిపడుతున్నారు. భవిష్యత్తులో తమ ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment