పెద్ద దస్తగిరి హత్య.. వాస్త‌వాలు Vs టీడీపీ ప్ర‌చారం

పెద్ద దస్తగిరి హత్య.. వాస్త‌వాలు Vs టీడీపీ ప్ర‌చారం

ఇటీవల కడప జిల్లాలో జరిగిన పెద్ద దస్తగిరి హత్యోదంతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ హత్య వెనుక కడప మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పి. రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన వందల కోట్ల భూ వివాదం ఉందంటూ ఓ వ‌ర్గం మీడియా, ఓ రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా అకౌంట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఆరోపణలను వైసీపీ, రవీంద్రనాథ్ రెడ్డి పూర్తిగా ఖండించారు. ఇది పూర్తిగా రాజ‌కీయ ప్రేరేపిత దుష్ప్ర‌చారం అని స్థానికులు సైతం కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వివాదానికి సంబంధించిన ఆరోపణలు, క్షేత్రస్థాయి వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.

మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమిటి?
ప్రస్తుతం జ‌రుగుతున్న ప్రచారం ప్రకారం.. ఇటీవల హత్యకు గురైన పెద్ద దస్తగిరి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డికి ప్రధాన బినామీ అని ఆరోపిస్తున్నారు. కడపలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీకి చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన 23.26 ఎకరాల భూమిని రవీంద్రనాథ్ రెడ్డి తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అందులో రూ.50 కోట్ల విలువైన ఆస్తులను పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరుకు బదిలీ చేశారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఆ ఆస్తులను తిరిగి ఇచ్చే విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయని, ఆ వివాదమే పెద్ద దస్తగిరి హత్యకు దారితీసిందని తెలుగుదేశం పార్టీ అనుకూల‌ మీడియా సంస్థలుగా పేరొందిన మీడియా ఛాన‌ళ్లు కథనాలను ప్రసారం చేశాయి.

ఈ వివాదంలో అసలు వాస్తవాలు ఏంటి?
ఈ ఆరోపణలపై లీగల్ డాక్యుమెంట్లు మరియు రవీంద్రనాథ్ రెడ్డి వర్గీయుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. వివాదంలో ఉన్న ‘తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ’కి చెందిన భూమి పూర్తిగా పట్టా భూమి అని సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూమిలో ఒక్క సెంట్ స్థలం కూడా నిషేధిత ఆస్తుల (Prohibited Property) జాబితాలో లేదు.

ఈ స్థలాన్ని రవీంద్రనాథ్ రెడ్డి చట్టబద్ధంగా, అప్పటి మార్కెట్ ధర ప్రకారమే నిబంధనల లోబడి డబ్బులు చెల్లించి ‘లక్ష్మీ పద్మావతి కన్‌స్ట్రక్షన్స్’ పేరుతో కొనుగోలు చేశారు. పెద్ద దస్తగిరి రవీంద్రనాథ్ రెడ్డికి బినామీ కాదని, ‘లక్ష్మీ పద్మావతి కన్‌స్ట్రక్షన్స్’ కంపెనీలో ఆయన కూడా ఒక అధికారిక భాగస్వామి (Partner) అని స్పష్టమవుతోంది. ఈ కంపెనీలో రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పెద్ద దస్తగిరి, మరో నలుగురు వ్యక్తులు లీగల్‌గా పార్ట్‌నర్లుగా కొనసాగుతున్నారు.

ఈ సొసైటీకి సంబంధించిన కమిటీ గత 25 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ కమిటీకి సంబంధించిన ‘మీటింగ్ మినిట్స్’ (Meeting Minutes), రికార్డులలో ఈ భూముల కొనుగోలు, లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా నమోదై ఉన్నాయంటున్నారు వైసీపీ నేత‌లు. ఈ భూమిని రవీంద్రనాథ్ రెడ్డి కొనుగోలు చేయడానికి చాలా ఏళ్ల క్రితమే, అనగా 1989లోనే తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సుధీర్ ఈ భూములను కొనుగోలు చేశారని, ఇది ఈనాటి వివాదం కాదని స్థానిక రికార్డులు చెబుతున్నాయి.

ఈ హత్యకు పాత కక్షలు కారణమా లేక ఆర్థిక వివాదాలా అనే కోణంలో విచారణ జరుగుతుండగా, దీనిని రాజకీయ కోణంలో వందల కోట్ల భూ కుంభకోణంగా చిత్రీకరించడంపై రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన ఆధారాలు ఉన్న పట్టా భూమి వ్యవహారాన్ని అక్రమ రిజిస్ట్రేషన్‌గా చూపించడం సరికాదని వారు పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment