ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పతనం కొనసాగుతోంది. ధర్మశాల వేదికగా జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో 200 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ చేతిలో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఒకప్పుడు వరుసగా ఐదు విజయాలతో ప్లేఆఫ్స్ ఫేవరెట్‌గా కనిపించిన పంజాబ్.. ఇప్పుడు వరుసగా ఐదో పరాజయంతో తీవ్ర ఒత్తిడిలో పడింది. చివరి ఓవర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ మెరుపు బ్యాటింగ్‌తో 200 మార్క్ దాటిన పంజాబ్‌కు బౌలర్లు మాత్రం మరోసారి నిరాశపరిచారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో నియంత్రణ కోల్పోవడం జట్టుకు భారీ మూల్యం చెల్లింపజేసింది. మరోవైపు ముంబై తరఫున తెలుగు స్టార్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లో 75 పరుగులతో చెలరేగి మ్యాచ్‌ను పూర్తిగా ముంబై వైపు తిప్పేశాడు. యువ ఆటగాళ్ల ధాటికి పంజాబ్ వ్యూహాలు పూర్తిగా కూలిపోయాయి.
ఈ ఓటమితో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు నమోదైంది. 200కు పైగా స్కోర్‌ను డిఫెండ్ చేస్తూ అత్యధిక మ్యాచ్‌లు ఓడిపోయిన కెప్టెన్‌గా శ్రేయస్ నిలిచాడు. ఇప్పటివరకు అతని కెప్టెన్సీలో 20 సార్లు 200+ స్కోర్లు నమోదవగా అందులో ఏడు మ్యాచ్‌లు ఓటమిగా ముగిశాయి. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ 2026 సీజన్‌లో ఐదు వరుస విజయాల తర్వాత ఐదు వరుస పరాజయాలు చవిచూసిన రెండో జట్టుగా నిలిచింది. 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాత ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జట్టుగా పంజాబ్ నిలవడం అభిమానులను కలవరపెడుతోంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇక మిగిలిన ప్రతి మ్యాచ్ పంజాబ్‌కు డూ ఆర్ డైగా మారింది.








