జనసేనలో ముదిరిన ‘బాలినేని వర్సెస్ రియాజ్’ వివాదం

జనసేనలో ముదిరిన ‘బాలినేని వర్సెస్ రియాజ్’ వివాదం

ప్రకాశం జిల్లా (Prakasam District) జనసేన పార్టీలో (Jana Sena Party) వర్గ పోరు మరోసారి భగ్గుమంది. ఒంగోలులోని (Ongole) ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశం ఈ విభేదాలకు వేదికైంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక భేటీకి జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ వర్గం దూరంగా ఉండటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

అధ్యక్షుడికే ఆహ్వానం లేదా?
ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు, ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (OUDA) ఛైర్మన్ షేక్ రియాజ్ (Shaik Riyaz) ఈ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, జిల్లా అధ్యక్షుడిని పిలవకుండా సమావేశం నిర్వహించడంపై రియాజ్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైసీపీ(YSRCP) నుంచి జనసేనలో(Janasena) చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధిపత్యాన్ని జిల్లాలోని పాత జనసేన నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా.. తాజా ఘటన ఆ విభేదాలకు మరింత ఆజ్యం పోసింది.

‘అమ్ముడుపోయారు’ అంటూ నినాదాలు
సమావేశం జరుగుతుండగానే అద్దంకి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అద్దంకి మాజీ ఇన్‌ఛార్జ్ కంచర్ల శ్రీకృష్ణ (Kancharla Srikrishna), ఎర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ గౌతమ్ రాజులు (Gautham Raju) గత ఎన్నికల సమయంలో మ‌రొక పార్టీకి అమ్ముడుపోయారని కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీకి నమ్మకద్రోహం చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.

రెండు వర్గాలుగా జనసేన
వైసీపీ నుంచి వచ్చిన బాలినేని ఒక వర్గంగా.. జిల్లాలో పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న షేక్ రియాజ్ మరో వర్గంగా విడిపోయినట్లు కనిపిస్తోంది. పదవుల పంపిణీ, పార్టీలో ప్రాధాన్యత విషయంలో ఇరు వర్గాల మధ్య గ్యాప్ పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ స్థాయిలో వర్గ విభేదాలు బయటపడటం జనసేన అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వివాదంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో, జిల్లా నేతలను ఎలా సమన్వయం చేస్తారో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment