సినిమా రంగంలో భారీ బడ్జెట్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇండియన్ సినిమా నుంచి ‘వారణాసి’, ‘రామాయణ’ వంటి భారీ ప్రాజెక్టులు వస్తుంటే, చైనా, కొరియా దేశాలు కూడా వెయ్యి కోట్ల క్లబ్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఒక చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలువునా మునిగిపోయింది. సినిమా చరిత్రలో నిర్మాతలకు ఇంతటి నష్టాన్ని మిగిల్చిన మరో చిత్రం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆ సినిమా పేరు ‘డెసర్ట్ వారియర్’ (Desert Warrior). ఏడవ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో యువరాణి హింద్, చక్రవర్తి కిస్రాపై చేసే పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాలనుకున్నారు. దీనికి ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ దర్శకుడు రూపర్ట్ వ్యాట్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో నటించిన వారంతా దిగ్గజాలే.. అయినా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. మార్వెల్ (MCU) కొత్త కెప్టెన్ అమెరికా ఆంథోనీ మాకీ ప్రధాన పాత్రలో నటించారు. ఆస్కార్ విజేత బెన్ కింగ్స్లీ నెగటివ్ రోల్ పోషించారు. వీరితో పాటు షార్ల్టో కోప్లీ, అయేషా హార్ట్ వంటి అంతర్జాతీయ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఈ సినిమా బడ్జెట్ మరియు వసూళ్ల వివరాలు చూస్తే షాక్ అవ్వడం ఖాయం. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.1400 కోట్లతో నిర్మించారు. కేవలం రూ.6 కోట్లు మాత్రమే రాబట్టింది. పెట్టిన పెట్టుబడిలో 99.6% నష్టపోయారు నిర్మాతలు. భారీ ఎడారి సెట్టింగులు, అంతర్జాతీయ టెక్నీషియన్లు, సుదీర్ఘ కాలం పాటు జరిగిన షూటింగ్ కారణంగా బడ్జెట్ కంట్రోల్ తప్పింది. రెండేళ్ల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుని 2025లో జూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. అనంతరం 2026 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కనీసం టాప్ 5 సినిమాల జాబితాలో కూడా చోటు సంపాదించుకోలేకపోయింది.
సౌదీ అరేబియా సినిమా పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఆశించిన ఎంబీసీ (MBC) స్టూడియోస్ కలలు ఈ దారుణమైన ఫ్లాప్‌తో చెదిరిపోయాయి.








