కరీంనగర్ నడిబొడ్డున ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు మెరుపు దాడికి దిగడం కలకలం రేపింది. రాడ్లు, కర్రలతో వచ్చిన బండి సంజయ్ అనుచరులు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి, కారు అద్దాలను ధ్వంసం చేశారు.
లా అండ్ ఆర్డర్ ఏమైంది..? కౌశిక్ రెడ్డి ప్రశ్న
దాడి అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు. “నన్ను చంపడానికి రెక్కి నిర్వహిస్తున్నారని కొద్దిసేపటి క్రితమే చెప్పాను.. చెప్పిన కాసేపటికే దొంగల్లా వచ్చి దాడి చేశారు. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇది ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా?” అని ఆయన ప్రశ్నించారు.
ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరూ ములాఖత్ అయ్యారని, తనను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శించారు. గన్ కల్చర్, కట్టెలతో దాడులు చేయడం కరీంనగర్ సంస్కృతి కాదని హితవు పలికారు.
కరీంనగర్లో ఉన్న రౌడీ షీటర్లందరినీ పోగుచేసి తనపైకి పంపారని ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీసులు చూస్తుండగానే బీజేపీ నాయకులు వీరంగం సృష్టించడం దారుణమన్నారు. దాడికి వచ్చిన ప్రతి ఒక్కరిపై అటెంప్ట్ మర్డర్ (హత్యాయత్నం) కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. “గుండాలను పెట్టుకుని దాడులు చేస్తే నేను భయపడను. నేను ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు, కేవలం ప్రజల పక్షాన నిలదీస్తున్నాను” అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉద్రిక్తత కొనసాగింపు..
దాడి నేపథ్యంలో కరీంనగర్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేపై దాడిని బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా ఖండించింది.
కరీంనగర్లో భయానకం.. రాడ్లు, కర్రలతో బీజేపీ శ్రేణుల వీరంగం
— Telugu Feed (@Telugufeedsite) May 7, 2026
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బండి సంజయ్ అనుచరుల దాడి
కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది..? అని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్యే ప్రశ్నించిన కాసేపటికే దాడి.. కారు అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు… pic.twitter.com/WtaVKgMgmv








