ఏపీలో (Andhra Pradesh) సంచలనం సృష్టించిన ‘హనీ ట్రాప్’ (Honey Trap) కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) నాయకుడు రాజేష్ నాయుడుపై (Rajesh Naidu) వేటు పడింది. అదేవిధంగా, ఈ ముఠాకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై కూడా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అనంతపురం నగరంలోని 30వ డివిజన్ టీడీపి ఇంచార్జ్‌గా పనిచేస్తున్న రాజేష్ నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు (Poola Nagaraju) నిర్ణయం తీసుకున్నారు.
మహిళలను ఎరగా వేసి, సంపన్న వ్యక్తులు, అమాయకులను వలపు వలలో పడేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు రాజేష్ నాయుడుపై ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీ అండ చూసుకొని నిందితుడు తన రాజకీయ పరపతిని ఉపయోగించి ఈ అరాచకాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో (Primary Investigation) తేలడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఈ కేసులో రంగమ్మ నాయుడు, నరేంద్రరెడ్డిలు టీడీపీకి(TDP) చెందిన వారని, టీడీపీ నేతలతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ముఠాకు సహకరించిన పోలీసులపై వేటు
హనీ ట్రాప్ ముఠాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అనంతపురం ఎస్పీ జగదీష్ పోలీసు శాఖలో ప్రక్షాళన చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు సీఐలను వీఆర్‌కు పంపించిన ఉన్నతాధికారులు.. తాజాగా ఈ ముఠాకు ప్రత్యక్షంగా సహకరించిన ఒక ఏఎస్సై (ASI), ఐదుగురు కానిస్టేబుళ్లను తక్షణమే వీఆర్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరంతా అనంతపురం రూరల్, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయిన అనంతపురం త్రీ టౌన్ సీఐ రాజేంద్ర నాథ్ యాదవ్ (Rajendra Nath Yadav),, రాప్తాడు సీఐ శ్రీహర్షలను (Sriharsha) ఉన్నతాధికారులు వీఆర్ కు అటాచ్ చేశారు.
అసలేం జరిగింది?
నిందితులు ఒక ముఠాగా ఏర్పడి, మహిళల ద్వారా వ్యక్తులకు ఫోన్ కాల్స్ చేయించి నిర్జన ప్రదేశాలకు రప్పించేవారు. అక్కడ వారిని అభ్యంతరకర రీతిలో వీడియోలు తీసి, ఆ వీడియోలను బయటపెడతామని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసేవారు. పోలీసుల్లోని కొందరు సిబ్బంది వీరికి వెన్నుదన్నుగా నిలిచి, బాధితులు ఫిర్యాదు చేయకుండా అడ్డుకోవడం లేదా సెటిల్మెంట్లు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసును ప్రత్యేక బృందం విచారిస్తోంది. ముఠా సభ్యులతో పాటు వారికి సహకరించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.









