తెలంగాణ రాష్ట్రంపై (Telangana State) బీజేపీ నాయకులు (BJP Leaders) పదేపదే విషం చిమ్ముతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను అవమానించేలా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.
బ్రిటిష్ కాలంలో (British Era) జరిగిన భారత్-పాక్ విభజన (India-Pakistan Partition) కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణల (Telangana) విభజన జరిగిందంటూ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. లక్షలాది మంది బలిదానాలు, దశాబ్దాల పోరాటం తర్వాత సిద్ధించిన తెలంగాణను పాక్ విభజనతో పోల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
“సమయం దొరికినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్మడం బీజేపీకి(BJP) అలవాటుగా మారింది. బయటి రాష్ట్రాల నాయకులు వచ్చి మన రాష్ట్రం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే, ఇక్కడి బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం దుర్మార్గం” అని పొన్నం విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినందుకు బీజేపీ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల నిరంతరం వివక్ష చూపుతోందని, ఇప్పుడు వారి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నైజాన్ని బయటపెడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, విభజన ప్రక్రియను కించపరిచేలా మాట్లాడటం ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.









తెలంగాణను అవమానిస్తే సహించం.. కేటీఆర్, హరీష్ ఫైర్