తెలుగుదేశం పార్టీలో (Telugu Desam Party) ‘చిన్నబాబు’ నారా లోకేష్‌కు (Nara Lokesh) కీలక పదవి కేటాయించారు చంద్రబాబు (Nara Chandrababu Naidu).ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా (Party Working President) నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. త్వరలో పట్టాభిషేకం జరగబోతోందని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ నియామకంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు వైసీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత పేర్ని నాని (Perni Nani). చంద్రబాబు, లోకేష్‌ల తీరును ఎండగడుతూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు బిజీ.. అందుకే ఈ పదవి!
లోకేష్‌కు పదవి ఇవ్వడం వెనుక ఉన్న అసలు లాజిక్‌ను పేర్ని నాని బయటపెట్టారు. “చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రాన్ని దోచుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఆ బిజీ షెడ్యూల్ వల్ల పార్టీని పట్టించుకునే తీరిక లేనట్టుంది. అందుకే లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ‘స్లీపింగ్’ ప్రెసిడెంట్ (Sleeping President) అన్నమాట.. లోకేష్ ‘వర్కింగ్’ ప్రెసిడెంట్!” (Working President) అంటూ ఎద్దేవా చేశారు.
అమరావతి ప్రేమ.. అంతా డ్రామా!
రాజధాని అమరావతి (Capital Amaravati) విషయంలో చంద్రబాబు చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదని నాని మండిపడ్డారు. 29 గ్రామాలే మీ రాజధానా అని ప్రశ్నించారు. “రెండేళ్ల క్రితమే సీఆర్డీఏలో(CRDA) మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును పెట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజంగానే మా ప్రాంతాలపై ప్రేమ ఉంటే, కేంద్రంలో అమరావతిపై చట్టం చేసినప్పుడు కేవలం 29 గ్రామాల పేర్లే ఎందుకు పెట్టించారు? మా ఊర్ల పేర్లు ఎందుకు చేర్చలేదు?” అని ప్రశ్నించారు.
అమరావతి అనేది కేవలం టీడీపీ నేతలు బాగుపడటం కోసం వేసిన స్కెచ్ అని, అది రాష్ట్ర ప్రజల రాజధాని ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. “చట్టం అవసరం లేని చోట చట్టం చేశారు.. మా ప్రాంతం లేకుండా ముద్ర వేయించుకున్నారు. అది మీ రాజధాని అవుతుంది కానీ, మా రాజధాని ఎలా అవుతుంది?” అని సూటిగా ప్రశ్నించారు.
మావిగన్ (MAVIGUN) ఒక అద్భుతం
రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే అమరావతిని ఎత్తుకున్నారని ఆరోపించిన పేర్ని నాని, ‘మావిగన్’ (MAVIGUN) ప్రతిపాదనను సమర్థించారు. ఇది రాష్ట్రాన్ని బాగు చేసే అద్భుతమైన ఆలోచన అని, చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు ప్రజలకు పూర్తిగా అర్థమైపోయాయని ఆయన హెచ్చరించారు. “దోచుకోవడానికి చంద్రబాబు, దాచుకోవడానికి లోకేష్.. ఇదీ ప్రస్తుత టీడీపీ పాలసీ” అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి.








