హైడ్రాకు హైకోర్టు భారీ షాక్‌..

హైడ్రాకు హైకోర్టు భారీ షాక్‌..

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) హైడ్రా (HYDRA) చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జలాశయాలు, నాలాలు, పార్కులు, ప్రజా రహదారుల పునరుద్ధరణ మినహా ఇతర అనధికార నిర్మాణాల కూల్చివేత చర్యలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) ఐలాపూర్‌లో (Ailapur)హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా భారీ నిర్మాణాలను కూల్చివేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. సంస్థ ప్రవర్తన పెత్తందారీ ధోరణిలో ఉందని, సరైన ప్రామాణిక విధానాలు లేకుండా చర్యలు చేపడుతున్నట్టు అభిప్రాయపడింది.

అలాగే, హైడ్రా ఏర్పాటు అయి ఏడాది గడిచినా జీహెచ్‌ఎంసీ (GHMC), పురపాలక చట్టాలకు అనుగుణంగా పనిచేస్తోందా అనే విషయంలో స్పష్టత లేదని కోర్టు ప్రశ్నించింది. అన్ని చర్యలకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా, ఫాతిమా కాలేజీ (Fatima College) నిర్మాణంపై కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ, చెరువులో నిర్మాణం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో అక్కడ చదవదలిచిన విద్యార్థులు రిస్క్ తీసుకోవాల్సిందేనని పేర్కొంది. ఈ విషయాన్ని కాలేజీ నోటీసు బోర్డులో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment